శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పాదన | Srisailanlo again in power generation | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పాదన

Nov 30 2014 2:44 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పాదన - Sakshi

శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పాదన

కృష్ణా నదీ జలాల బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగలో తొక్కింది. శ్రీశైలం జలాశయం ఎడమగట్టు వద్ద శనివారం మళ్లీ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది.

కడప సెవెన్‌రోడ్స్ : కృష్ణా నదీ జలాల బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగలో తొక్కింది. శ్రీశైలం జలాశయం ఎడమగట్టు వద్ద శనివారం మళ్లీ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. దీంతో 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయంలో ప్రస్తుతం 854 అడుగుల కనీస స్థాయి నీటిమట్టం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ విద్యుత్ ఉత్పాదన ప్రారంభించడం రాయలసీమ రైతులను తీవ్రంగా కలవర పరుస్తోంది.

కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీ-నీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టు రైతుల భవిత ప్రశ్నార్థంగా మారుతోంది. జిల్లాలో కేసీ కెనాల్ కింద సుమారు 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సెప్టెంబరులో రాష్ర్ట ప్రభుత్వం జిల్లాలోని కేసీ ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టింది. దీంతో రైతులు అనేక వ్యయ ప్రయాసలు కోర్చి పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికి రావాలంటే కనీసం జనవరి 15వ తేదీ వరకు శ్రీైశైలం నుంచి నీటి విడుదల జరగాలి.

ఇందుకు ఐదు టీఎంసీల వరకు నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కేసీతోపాటు ఎస్‌ఆర్‌బీసీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు ప్రభుత్వం నీరిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సాగైన పంటలను పరిరక్షించుకోవడం పేరుతో విద్యత్ ఉత్పాదన చేపట్టడం ఈ ప్రాంత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని నిర్మాణం, భూసేకరణ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మినహా రాయలసీమ గోడు పట్టడం లేదు.

రాష్ర్ట ప్రభుత్వం తొలి నుంచి సీమ ఆయకట్టు ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహారిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఒక దశలో శ్రీశైలం జలాశయంలోకి 880 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీమ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి మరీ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పడిపోతూ వచ్చింది.

అంతా అయిపోయే దశలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాధినేతలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే నీటిమట్టం తగ్గకుండా ఉండాలంటూ డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల బోర్డుకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇందుకు ప్రతీగా తెలంగాణ నేతలు కూడా ఆంధ్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

విమర్శలకే పరిమితం కావడం మినహా శ్రీశైలం జలాశయ నీటి నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆరోపణలు జిల్లాలో సర్వత్రా వినబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారించడం నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రయోజనాలకేననే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.

ప్రస్తుతం కేసీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఎస్‌ఆర్‌బీసీ ఆయకట్టు అవసరాలు తీరాలంటే జలాశయంలో కనీస మట్టానికి దిగువన ఉన్న నీటిని వినియోగించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. పరిస్థితులు ఓవైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement