breaking news
Rayalaseema farmers
-
రాయలసీమ రైతులను అవహేళన చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు
-
రైతుల వలసలపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు..
సాక్షి, అమరావతి: రైతుల వలసలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ వాళ్లకి వలస వెళ్లడం అలవాటని వ్యాఖ్యానించారు. వాళ్లు ఎక్కువ ఆదాయం కోసం వలస వెళ్తారు.. ఇక్కడ ఏమీ లేక కాదని అన్నారు. అంతేకాకుండా శ్రీకాకుళం నుంచి వలస వెళ్లేవారి గురించి కూడా చంద్రబాబు ఇదే రకంగా మాట్లాడారు. శ్రీకాకుళం వాళ్లు ఎప్పుడు వలస వెళ్తుంటారు.. అక్కడ నీళ్లు లేక కాదు వాళ్లు వలస వెళ్తుందని వ్యంగ్యంగా స్పందించారు. ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాళ్లే ఉంటారని అన్నారు. రాయలసీమ, శ్రీకాకుళం నుంచి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వేళ్లే రైతుల గురించి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వారిని కించపరిచాలే ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఎంత చులకన భావం ఉందో మరోసారి స్పష్టమయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రధానికి సీమ రైతుల స్పెషల్ గిఫ్ట్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 68వ పుట్టినరోజు జరుపుకున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుంచి పార్టీల కతీతంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేయటం చూశాం. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఆయనకు ఊహించని బహుమతులు అందాయి. 68 పైసలతో 400 చెక్కులు రాసి ఆయనకు కానుకగా పంపారు రాయలసీమ సాగునీటి సాధన సమితి(ఆర్ఎస్ఎస్ఎస్) సభ్యులు. దేశంలోనే థార్ ఎడారి తర్వాత అనంతపురం జిల్లా అత్యల్ప వర్షాపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కింది. అలాంటిది ఆ ప్రాంతంలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ఎస్ ప్రతినిధులు ఇలా వినూత్న నిరసన తెలియజేశారు. ‘రాయలసీమ నాలుగు జిల్లాలో సాగునీటి వసతిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. అయితే ఇక్కడ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో కోస్తాంధ్రా అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నారు. సాయం చేయాల్సిన కేంద్రం కూడా ఇక్కడి రైతులను పట్టించుకోవటం లేదు. అందుకే తమ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా నిరసనను తెలియజేశాం’ అని ఆర్ఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. -
శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పాదన
కడప సెవెన్రోడ్స్ : కృష్ణా నదీ జలాల బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగలో తొక్కింది. శ్రీశైలం జలాశయం ఎడమగట్టు వద్ద శనివారం మళ్లీ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. దీంతో 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయంలో ప్రస్తుతం 854 అడుగుల కనీస స్థాయి నీటిమట్టం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ విద్యుత్ ఉత్పాదన ప్రారంభించడం రాయలసీమ రైతులను తీవ్రంగా కలవర పరుస్తోంది. కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, హంద్రీ-నీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టు రైతుల భవిత ప్రశ్నార్థంగా మారుతోంది. జిల్లాలో కేసీ కెనాల్ కింద సుమారు 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సెప్టెంబరులో రాష్ర్ట ప్రభుత్వం జిల్లాలోని కేసీ ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టింది. దీంతో రైతులు అనేక వ్యయ ప్రయాసలు కోర్చి పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికి రావాలంటే కనీసం జనవరి 15వ తేదీ వరకు శ్రీైశైలం నుంచి నీటి విడుదల జరగాలి. ఇందుకు ఐదు టీఎంసీల వరకు నీరు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కేసీతోపాటు ఎస్ఆర్బీసీ, హెచ్ఎన్ఎస్ఎస్లకు ప్రభుత్వం నీరిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సాగైన పంటలను పరిరక్షించుకోవడం పేరుతో విద్యత్ ఉత్పాదన చేపట్టడం ఈ ప్రాంత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని నిర్మాణం, భూసేకరణ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం మినహా రాయలసీమ గోడు పట్టడం లేదు. రాష్ర్ట ప్రభుత్వం తొలి నుంచి సీమ ఆయకట్టు ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహారిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా ఒక దశలో శ్రీశైలం జలాశయంలోకి 880 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సీమ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి మరీ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పడిపోతూ వచ్చింది. అంతా అయిపోయే దశలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాధినేతలు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే నీటిమట్టం తగ్గకుండా ఉండాలంటూ డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల బోర్డుకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇందుకు ప్రతీగా తెలంగాణ నేతలు కూడా ఆంధ్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విమర్శలకే పరిమితం కావడం మినహా శ్రీశైలం జలాశయ నీటి నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆరోపణలు జిల్లాలో సర్వత్రా వినబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారించడం నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రయోజనాలకేననే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ప్రస్తుతం కేసీ, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ ఆయకట్టు అవసరాలు తీరాలంటే జలాశయంలో కనీస మట్టానికి దిగువన ఉన్న నీటిని వినియోగించుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. పరిస్థితులు ఓవైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.