శ్రీశ్రీ అభిమానులకు పండుగ

Sree Sree Books Fetival in krishna - Sakshi

పుస్తక మహోత్సవంలో ఆకర్షణగా ‘శ్రీశ్రీ సాహిత్య నిధి స్టాల్‌’

రూ. 6వేల విలువైన నూరు పుస్తకాలు వెయ్యికే అందిస్తున్న సింగంపల్లి

సాక్షి, అమరావతి బ్యూరో: ‘కదిలేది కదిలించేది.. పెనునిద్దుర వదిలించేది.. మునుముందుకు నడిపించేది.. పరిపూర్ణ బ్రతుకిచ్చేది కావాలోయ్‌ నవకవనానికి’ అన్న శ్రీశ్రీ ఆధునిక సాహిత్యంలో చెదరని ముద్ర వేశారు. 20వ శతాబ్ధపు కవిగా కీర్తింపబడ్డ శ్రీశ్రీ సాహిత్యాన్ని భావితరాలకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఓ శ్రీశ్రీ వీరాభిమాని. ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి శ్రీశ్రీ రాసింది, చెప్పింది, శ్రీశ్రీపై ఇతరులు రాసింది, చెప్పింది పొల్లుపోకుండా నిక్షిప్తం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు రచయిత సింగంపల్లి అశోక్‌కుమార్‌. విజయవాడ పుస్తక మహోత్సవంలో షాప్‌ నెంబర్‌ 112లో శ్రీశ్రీ సాహిత్య నిధి పేరిట ప్రత్యేకంగా ఏర్పాటుచేసి  శ్రీశ్రీ సాహిత్య సేవ చేస్తూ ఆయన ఆనందం పొందుతున్నారు.

నూరు పుస్తకాలు వెయ్యి రూపాయలు
శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ఇలా వంద పుస్తకాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ‘నూరు పుస్తకాల హోరు’ అనే పేరుతో రూ. 6 వేల విలువ చేసే పుస్తకాలను కేవలం వెయ్యి రూపాయలకే పంపిణీ చేస్తున్నారు. 2008లో ప్రారంభించిన సాహితీ ఉద్యమంలో అశోక్‌కుమార్‌ విజయవంతమయ్యారు. నూరు పుస్తకాల హోరులో ప్రతి మూడు నెలలకు శ్రీశ్రీ సాహిత్యంపై నాలుగు పుస్తకాలను సంస్థ ప్రచురిస్తోంది. వెయ్యి రూపాయలు చందాగా కట్టిన వారికి ప్రచురించిన ప్రతి పుస్తకాన్ని అందజేస్తారు. ఇప్పటి వరకు 90 పుస్తకాలను సాహిత్య నిధి ప్రచురించి శ్రీశ్రీ అభిమానుల దాహార్తిని తీర్చింది.

కవినీ, కమ్యూనిస్టునూ చేసింది శ్రీశ్రీ
నన్ను కవిని, కమ్యూనిస్టుని, మానవతావాదిని చేసింది శ్రీశ్రీయే అని శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్‌ సింగంపల్లి అశోక్‌కుమార్‌ అన్నారు. ఆయన స్పూర్తితో ఇప్పటి వరకు 18 పుస్తకాలను, ఎన్నో కవితలను రచించానని చెప్పారు. ఎనిమిదేళ్లుగా బుక్‌ ఫెస్టివల్‌లో స్టాల్‌ను నిర్వహిస్తున్నా..శ్రీశ్రీ సాహిత్యానికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, తగ్గబోదని ఆయన స్పష్టంచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top