అరుణమ్మ కన్నీటికి కారకులెవరు?

Special Story On Former minister Galla Aruna Kumari - Sakshi

మాజీ మంత్రి మాటల్లోని మర్మమేంటి?

తనను నమ్ముకున్న వారి ఎదుట దోషిగా నిలబెట్టిందెవరు?

 పార్టీలో చక్రం తిప్పుతున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు, క్రిమినళ్లెవరు? 

 మారుతున్న చంద్రగిరి రాజకీయ రంగు 

రాయలసీమ రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. ఇలా రాణించిన వారిలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఒకరు. జిల్లాలో ఒంటి చెత్తో రాజకీయాలను నడిపిన ఆమె చివరకు ఉబికి వస్తున్న కన్నీటిని బిగపట్టుకుని బయలుదేరాల్సిన దుస్థితి ఏర్పడింది. కనుసైగలతోనే ఆదేశాలు... కనుచూపులతోనే శాసించగల సత్తా కలిగిన నాయకురాలు తనను నమ్ముకున్న వారి ఎదుటే దోషిగా ఎందుకు నిలవాల్సి వచ్చింది. మూడు దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన అరుణమ్మ మనస్సును గాయపరిచినవారెవరు? 

తిరుపతి రూరల్‌:  జిల్లా రాజకీయాల్లో గల్లా అరుణకుమారి మాటంటే మాటే. పదేళ్లపాటు మంత్రిగా తిరుగులేని నేతగా చెలాయించిన ఆమె టీడీపీలో తీరని అవమానాలు ఎదుర్కొన్న విషయం జగమెరిగిన సత్యం. ఇవన్నీ చాలా కాలం తరువాత ఆమె నోటి వెంటే బయటకు వచ్చాయి. తిరుపతి రూరల్‌ మండలంలో ఆది వారం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశంలో అరుణమ్మ తన ఆవేదనను, అం దోళనను వెళ్లగక్కడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకురాలుగా చెలా మణి అవుతున్న అరుణమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు భవిష్యత్తు కోసం తానెప్పుడూ గడప కూడా తొక్కని టీడీపీలోకి అడుగుపెట్టక తప్పలేదు. 

అప్పటి నుంచే ఆమె టీడీపీలో ఇమడలేకపోతున్నారనే విషయం  అందరికీ తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయనే విషయం అక్కడా, ఇక్కడా వినిపిస్తూనే ఉంది. వాటిపై మాజీ మంత్రే కుండబద్ధలు కొట్టారు. తన వెంటే ఉంటూ తన కారులోనే తిరుగుతూ కుట్రలు చేసిన వారు, ద్రోహానికి పాల్పడిన వారు ఉన్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల తర్వాత మాజీ మంత్రి అరుణమ్మ టీడీపీలో నిలదొక్కుకోవడానికి తన సహజ సిద్ధ స్వభావాన్ని పక్కనపెట్టి సర్దుకుపోయే ధోరణితో కూడా వ్యవహరించారు. రాజకీయాల నుంచి చాలా గౌరవంగా తప్పుకోవాలని, పార్టీలో ఇమడలేకపోతున్నానని, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని అప్పటికే సీఎం చంద్రబాబుకు అరుణకుమారి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

 చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని అంతర్గతంగా విన్నవించుకున్నారు. సీఎంను ఒప్పించాక కార్యకర్తలకు నచ్చజెప్పి ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి హుందాగా తప్పుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని సీఎంకు పలుమార్లు చెప్పారు.  రెండేళ్ల కాలంలో అది ఏదీ కూడా  బయటకు పొక్కలేదు. అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్న ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మంత్రి అమరనాథరెడ్డితో కలసి సీఎంతో భేటీ అయ్యారు. ఇదే భేటీలో అరుణమ్మ  ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని మరోమారు కోరారు. తర్వాత విజయవాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. 

ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగే గంట వ్యవధిలోనే అరుణమ్మ రాజకీయాల నుంచి నిష్క్రమించనున్నట్లు టీవీ ఛానల్స్‌లో కథనాలు వచ్చాయి. ఇదే అంశాన్ని అరుణమ్మ కార్యకర్తల సమన్వయ సమావేశంలో గుర్తు చేశారు. రెండేళ్ల నుంచి బయటకు రాని విషయం గంటలోనే ఎలా లీకు అయిందని వేదికపైన ఉన్న పులివర్తి నానిని పరోక్షంగా ప్రశ్నిం చారు. దీంతో నమ్ముకున్న వారి ఎదుట, తను నమ్మిన వారి ఎదుట దోషిగా నిలబడాల్సి వచ్చిందని అరుణమ్మ కన్నీటిని రెప్పచాటునే అదిమి పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె అనుచరులు చలించిపోయారు.

చంద్రగిరిలో టీడీపీకి ఊతమిచ్చిందెవరు?
చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మొదటి నుంచి అరువు నాయకుల మీదే ఆధారపడుతోంది. ఎన్నికల సమయానికి ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావటం పోటీ చేయిం చడం, ఆపై వారు అందుబాటులో లేకుండా పోవటం జరుగుతోంది. ఈ కారణంగా కార్యకర్తలు కాస్తంత నిస్తేజంగా ఉండిపోయారు. కానీ 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అరుణమ్మ పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేశారు. హుదూద్‌ వరద బాధితులను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున విరాళాలను రాష్ట్రంలోనే అత్యధికంగా సేకరించారు.

 అదే సమయంలో పార్టీ సభ్యత్వం కూడా పెద్ద ఎత్తున చేసి గుర్తింపు పొందారు. వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ అరుణమ్మ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలను నాయకుల స్థాయికి తీసుకువచ్చానని, పార్టీని జీరో స్థాయి నుంచి ప్రతిష్టంగా నిలబెట్టానని చెప్పటంలో కూడా నిగూఢ అర్థముంది. అయితే నాడు పార్టీ కోసం పనిచేయని వారే...నేడు తెల్లచొక్కాలు వేసుకుని ముందు వరసలో కూర్చున్నారని చెప్పటంతో ప్రస్తుత పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావించారు.

టీడీపీలోని ఆ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్‌ ఎవరు?
పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇదే సమయంలో కీలక వ్యాఖ్య లు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తన వెంట పేద, బడుగు, బలహీన వర్గాలు మాత్రమే ఉండేవారని, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, క్రిమినల్స్‌ లేరని వ్యాఖ్యనించడం కలకలం రేపింది. తనవెంట లేరంటే ఇప్పుడు టీడీపీలో క్రిమినల్‌ నేపథ్యం ఉన్న వ్యాపారస్తులెవరు? వారి వెనుక ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు? క్రిమినల్స్‌ ఎవరనే గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో అక్కడున్న నాయకులు కా స్తంత ఉలికిపాటుకు గురయ్యారు.

 ప్రశాంతంగా, సౌమ్యంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాల్లోకి వ్యాపారులు, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్‌ ప్రవేశిస్తున్నారనే అంశాన్ని ఆమె నేరుగానే ప్రస్తా్తవించారు. దీంతో వేదికపైనే ఉన్న నాయకులు కూడా ఖంగుతినాల్సి వచ్చింది. చంద్రగిరి రాజకీయం రంగు మారుతోందని, ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదనే విషయాన్ని ఆమె సూచా యగా చెప్పారు. చెప్పుకోలేని ఆవేదనతో నిశ్శబ్దంగా అరుణమ్మ వెళ్లిపోవటంతో అనుచరుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు కన్పించాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top