డెయిరీ తెరిస్తేనే..చొక్కావేస్తా

Special story on edala venkatachala naidu protest on dairy open - Sakshi

పట్టుదలకు పెట్టింది పేరు

ఉద్యమం ఆయన శ్వాస

ఎవరు రాకున్నా ఒంటరి పోరు

చిత్తూరు డెయిరీ తెరిచే వరకూ చొక్కా వేయనంటూ భీష్మించారు

కాళ్లకు చెప్పులూ వేసుకోవడం లేదు

15ఏళ్లలో నిరసన దీక్షలెన్నో..

ఈదల వెంకటాచలనాయుడు ఆదర్శ పోరుబాట

ఆరు పదులు దాటిన వయసు. బక్క చిక్కిన శరీరం. శరీరం పైకి ఓ పంచె, కండువా. చొక్కా కూడా వేసుకోరు. సాధారణంగా కనిపించే ఈ వ్యక్తి వెనుక అసాధారణ పట్టుదల..సంకల్పం ఉన్నాయి.  ఫలితం ఎదురు చూడని ఉద్యమ కారుడీయన.  లక్ష్య సాధన కోసం ఎన్నాళ్లయినా నిరీక్షించే తత్వం. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా వందల కిలో మీటర్లు నడిచి వెళ్లిపోతుంటాడు. ఆయనే ఈదల వెంకటాచల నాయుడు. ఈ రైతు ఉద్యమ నేత గురించి తెలుసుకుందాం...

చిత్తూరు (అర్బన్‌): కష్టం వచ్చినప్పుడు సాయం కోసం పక్క వారిని పిలుస్తాం. కానీ వెంకటాచల నాయుడు తనను ఎవరూ పిలవకున్నా వచ్చి నిలబడుతాడు. నీ కష్టం ఏమిటని అడుగుతాడు. అలా అడిగి వెళ్లిపోడు. వెన్నంటే నిలుస్తా డు. ఈయనది పెనుమూరు మండలంలోని సాతంబాకం పంచాయతీ పెరుమాళ్ల కండిగ. ఆరెకరాల పొలం, నాలుగు ఆవులే ఆయన ప్రపంచం. పోరాట పటిమకు పెద్దగా చదువులు అవసరంలేదని ఐదో తరగతి వరకు చదువుకున్నా రు. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప వెంకటాచలంకు మరో లోకం తెలియదు. ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలను డెయిరీకి పోసి జీవనం సాగించేవాడు. 15 ఏళ్లకు పైగా జిల్లాలో ఏ రైతుకు కష్టమొచ్చినా అక్కడ వాలిపోతుంటారు.

రూ.2 కోసం తొలి ఉద్యమం...
2003లో ఎదురైన ఓ ఘటన తనలో పోరాట స్ఫూర్తికి బీజం వేసిందని చెబు తారు వెంకటాచలం. చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుకు గతంలో నాలుగు స్టేజీలు ఉండేవని, కొత్తగా ఓ స్టేజీ పెరగడంతో రూ.2 అదనంగా పెంచడాన్ని ఈయన తట్టుకోలేకపోయాడు. సామాన్యులపై అదనపు భారా న్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ 2003 జూన్‌లో పెనుమూరులో 16 రోజుల పాటు దీక్షకు కూర్చున్నాడు. సమస్య పరి ష్కారం కాలేదు. పట్టువదలకుండా ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008 లో 13 రోజులు దీక్షలు చేశాడు. ఏ ఒక్క రూ పట్టించుకోలేదు. ఫలితం కోసం ఎదురుచూడటం ఇష్టం లేదంటాడు.
 2002లో చిత్తూరు విజయా సహకార డెయిరీని సీఎం చంద్రబాబు నాయు డు హయాంలో మూసేశారు. రైతులంతా రోడ్డున పడ్డారు. డెయిరీ పునఃప్రారంభిం చాలని ఈయన వెంటనే దీక్షలు చేసినా ఫలితం కనిపించలేదు. 2005లో హైదరాబాదు వెళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటలు దీక్ష చేశాడు. 2007 అక్టోబరు 2న ప్రతిన పూనాడు. డెయిరీని పునః ప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని శపథం పూనారు. పదేళ్లుగా అలాగే ఉన్నాడు. ఎన్టీఆర్‌ జలాశయాన్ని శుభ్రం చేయిం చాలని 2008లో 18 రోజులు దీక్ష చేశాడు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీలో కనీస మద్దతు ధర కల్పించాలని 2015లో 48 రోజులకు పైగా దీక్షలు చేశాడు.

జీవనం అంతంతే...
ఎవరెట్లా పోతే మనకెందుకు. గమ్మున  ఇంటి పట్టున ఉండలేవా.. అంటూ ఈయన పెద్ద కుమారుడు పలుమార్లు హెచ్చరించినా వెంటాచలం నాయుడు తన పంథాను మార్చుకోలేదు. కుమారుడి ఇంటి నుంచి వెళ్లిపోయి మేస్త్రీ పనిచేసుకుంటున్నాడు. ఆవులను మేపుతూ పాలు, పంటలను అమ్మి వెంకటాచలం నాయుడు కూతురికి పెళ్లిచేశాడు. ఇంకో కొడుకును ఇంజనీరింగ్‌ చదివించాడు. ఉద్యమాల నుంచి పక్కకురాలేక, ఇళ్లు గడవలేక కష్టాలకు ఎదురెళ్లి ఎకరం పొలం కూడా అమ్మేశాడు. అయినా దీక్షలకు ఎవర్నీ అర్థించడు. ఎవరైనా తులమో ఫలమో ఇచ్చినా దాన్ని తీసుకుని ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని వెంకటాచలం నాయుడు చెబుతున్నారు. ప్రభుత్వాలు తన సమస్యల్ని పరిష్కరిస్తుందో లేదో తెలియదు... కానీ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు బాహ్య ప్రపంచానికి చెప్పడానికి తనదైన శైలిలో నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నాడు. చొక్కాలేకుండా తమ ఇంటికి రావద్దని ఇతనికి చెప్పినవారూ లేకపోలేదు. ఇవేవీ ఆయన పట్టించుకోలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top