పోయినా.. పర్వాలేదు

Special story on ATM Card , PAN cards - Sakshi

 ప్రతి అవసరానికి ఓ కార్డు

 కార్డు పోయినా కంగారు వద్దు

 తిరిగి పొందడం సులభమే

మంత్రాలయం రూరల్‌  సాంకేతిక అభివృద్ధి పరుగెడుతోంది. ఆ క్రమంలోనే ప్రతి వ్యక్తికీ అవసరాలు పెరుగుతున్నాయి.  మెరుగైన సేవలు, అక్రమాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వాలు, పలు సంస్థలు కార్డులు జారీ చేస్తున్నాయి. వ్యక్తి వివరాలు, చిరునామా తదితర అంశాలతో, బార్‌ కోడ్‌తో రూపొందించిన పలు కార్డులు అందరి జీవన గమనంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు జేబులు, పర్సుల్లో ఐదు నుంచి పది కార్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. అయినా ఒక్కోసారి పర్సు పోయినప్పుడు, జిరాక్స్‌ తీసుకునే సందర్భంలో మరిచిపోయినప్పుడు.. ఇతర కారణాలతో అవి దూరమైనప్పుడు ఆందోళన అంతా.. ఇంతా కాదు. అయితే కార్డు పోయినా పర్వాలేదు.. కొంత సమయం, తక్కువ ఖర్చుతో వాటిని పొందవచ్చు. అవసరమైన కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వాటి ఉపయోగం, అవి పోగొట్టుకుంటే ఎలా పొందాలనే వివరాలతో ప్రత్యేక కథనం.
 

రేషన్‌ కార్డు
దరఖాస్తు విధానం: నూతన రేషన్‌కారు కోసం కుటుంబసభ్యుల ఫొటోతో పాటు అందరి ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలతో పాటు దరఖాస్తు ఫారాన్ని జతపరిచి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలి. వారు వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేసి ఉంచుతారు. ప్రభుత్వం కార్డుల జారీ సమయంలో అర్హులకు పంపిణీ చేస్తారు.

ఉపయోగం: పేదలకు ఈ కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం తరుపున వచ్చే సబ్సిడీ సరుకులకు మాత్రమే పరిమితం కాకుండా ఆదాయం, పలు ధ్రువపత్రాలను పొందేందుకు రేషన్‌కార్డు ఉపయోగపడుతోంది. తెల్లరేషన్‌ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పేదలకు ఈ కార్డు ఎంతో ఉపయోగం.  

డూప్లికేట్‌ కార్డు పొందడం ఇలా: రేషన్‌ కార్డు పోతే  కార్డు నంబర్‌తో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్‌ గ్రామ రెవెన్యూ అధికారిని విచారణ నిమిత్తం ఆదేశిస్తారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా తహసీల్దార్‌ డూప్లికేట్‌ రేషన్‌కార్డు జారీకి ఆదేశాలు ఇస్తారు.   

పాన్‌ కార్డు
దరఖాస్తు విధానం: పాన్‌కార్డు కావాలంటే ముందుగా రెండు కలర్‌ ఫొటోలతో ఆదాయ పన్ను విభాగపు కార్యాలయంలో దరఖాస్తుతో పాటు ఓటరు, ఆధార్‌ జిరాక్స్‌ కాపీలను జతపరిచి అందజేయాలి. అధికారులు నిర్ణయించిన చలానా  కట్టాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు కార్డు పోస్టు ద్వారా చేరుతోంది.

ఉపయోగం:  ఆర్థిక లావాదేవిల్లో పాన్‌కార్డు ప్రసుత్తం చాలా కీలకం. ముఖ్యంగా బ్యాంక్‌ ఖాతాలకు పాన్‌కార్డును అనుసంధానం చేస్తారు. అంతే కాకుండా ఇతర ఖాతాకు రూ. 50 వేలకు మించి లావాదేవీలకు తప్పకుండా పాన్‌కార్డు నంబర్‌ వివరాలను తెలియజేయాల్సి వస్తుంది.  

డూప్లికేట్‌ కార్డు పొందడం ఇలా: ఈ కార్డు పోతే సంబంధిత ఏజెంట్‌ దగ్గర కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాన్‌కార్డు జిరాక్స్, రెండు కలర్‌ ఫొటోలు, రెసిడెన్సీ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డు కోసం దాదాపు రూ. 90 చెల్లించాలి. దాదాపు 3 వారాల్లో సూచించిన చిరునామాకు చేరుతోంది. మరిన్ని వివరాలకు  www. nsdipan. com లాగిన్‌ అవ్వాలి.  

 ఏటీఎం కార్డులు
దరఖాస్తు విధానం: బ్యాంక్‌ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి ఏటీఎం ఎంతో అవసరం. ఇందుకోసం సంబంధిత బ్యాంక్‌లో బ్యాంక్‌ ఖాతా నమోదు సమయంలో తెలియజేసిన వివరాలతో సంబంధించిన బ్రాంచ్‌ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దాదాపు 10 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా వస్తుంది.

ఉపయోగం: బ్యాంకులో జమ చేసిన డబ్బులను అక్కడికి వెళ్లకుండానే ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం కార్డును ఉపయోగించి తీసుకోవచ్చు. అదే కార్డు నుంచి నగదు బదిలీ సౌకర్యం కూడా కల్పించారు. నగదు రహిత లావాదేవీలకు ఈ కార్డులు ఎంతో కీలకంగా మారాయి.  

తిరిగి పొందడం ఇలా..: ఈ కార్డు పోగొట్టుకున్న వారు వెంటనే బ్యాంక్‌ వినియోగదారుల సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి వారు అడిగిన పూర్తి సమాచారం అందించి కార్డును బ్లాక్‌ చేయించాలి. ఆ తర్వాత వారిచ్చే ఫిర్యాదు నెంబర్‌ను సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌కు తెలియజేయాలి. ఈ విషయాన్ని నిర్ధారించిన తరువాత కొత్త కార్డును జారీ చేస్తారు.

 పాస్‌పోర్టు
దరఖాస్తు విధానం: పాస్‌పోర్టు అవసరమైన వారు ముందుగా దరఖాస్తుదారుడికి సంబంధించిన రెండు ఫొటోలు, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ కార్డు వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మొంట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో   www. passport. com అనే వెబ్‌సైట్‌ ఆధారంగా వివరాలను నమోదు చేసుకోవాలి. ఏపీలో మొత్తం ఐదు కేంద్రాలున్నాయి. కర్నూల్, కడప తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఆయా కార్యాలయాల వారీగా మనకు అవసరమైన చోట దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను విచారణ నిమిత్తం ఆ జిల్లా ఎస్పీ  కార్యాలయానికి పంపుతారు. అక్కడి నుంచి స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దరఖాస్తు దారుడి వివరాలతో ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేసి, ఎస్పీ నివేదిక అందజేస్తారు. వారు అక్కడి నుంచి పాస్‌పోర్టు అధికారికి పూర్తి స్థాయిలో నివేదిక పంపుతారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా చేరుకుంటుంది.

ఉపయోగం: పాస్‌పోర్టు ఉండటం ద్వారా మనం ఇతర దేశాలకు వెళ్లడానికి సులభతరమవుతోంది.  ప్రత్యేక ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలో పాస్‌పోర్టుతో పాటు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.  

డూప్లికేట్‌ పొందడం ఇలా: పాస్‌పోర్టు పోతే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ చేసి లభించకపోతే నాన్‌ట్రేస్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి పేరిట ఆన్‌లైన్‌ ద్వారా దాదాపు రూ.1500 చెల్లించాలి. ఈ రెండింటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి డూప్లికేట్‌ పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఇందుకు మూడు నెలలు సమయం పట్టవచ్చు. తాత్కాల్‌ పాస్‌పోర్టు కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.

 డ్రైవింగ్‌ లైసెన్స్‌
దరఖాస్తు విధానం: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ప్రభుత్వం కేటాయించిన రుసుంతో పాటు ఆధార్‌కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా/ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్, రెండు కలర్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించే టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందితే, ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ చేస్తారు. అనంతరం టెస్ట్‌ డ్రైవింగ్‌లో పాసయితే దాదాపు 15 రోజుల గడువులోగా లైసెన్స్‌ చేతికందుతోంది.

ఉపయోగం:  డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా వాహనం నడపడానికి అర్హులవుతాం. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో నకలు కాపీని అందజేయాల్సి వస్తోంది.

డూప్లికేట్‌ పొందడం ఇలా: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్‌ట్రేస్‌ సర్టిఫికెట్‌తో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తుతో స్థానిక ఆర్‌టీఓ కార్యాలయంలో అందించాలి. మరిన్ని వివరాలకు www. ap.transport.org.inవెబ్‌సైట్‌లో   తెలుసుకోవచ్చు.  

 ఆధార్‌ కార్డు
దరఖాస్తు విధానం: ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా నివాస ధ్రువపత్రంతో పాటు రెవెన్యూ అధికారి సంతకం తప్పనిసరిగా అవసరం. దరఖాస్తుతో పాటు వీటిని జతపరిచి మీ సేవ కేంద్రంలో నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి అక్కడ ఐరిస్‌  తీయించుకోవాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు ఆధార్‌కార్డు పోస్ట్‌ ద్వారా వస్తుంది.

ఉపయోగం:  రేషన్‌కార్డు, పింఛన్‌ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి చేశారు. పథకాలకు ఆధార్‌ అనుసంధానం కాకపోతే లబ్ధిపొందలేరు.  
డూప్లికేట్‌ కార్డు పొందడం ఇలా:  ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్‌ 18001801947కు కాల్‌ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో మన చిరునామా వస్తుంది.   help@uidi.gov.in.వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది.

 ఓటరు గుర్తింపు కార్డు
దరఖాస్తు విధానం: 18 సంవత్సరాలు నిండిన యువత వారి కలర్‌ ఫొటోలతో దరఖాస్తు ఫారాన్ని భర్తీ చేసి బూత్‌ లెవల్‌/గ్రామ రెవెన్యూ అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు విచారణ చేపట్టి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచుతారు. ఎన్నికల కమిషన్‌ పూర్తి వివరాలను పరిశీలించి కార్డును జారీ చేస్తారు. కార్డు బూత్‌ లెవల్‌/గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి పొందవచ్చును.  

ఉపయోగం: ఓటరు కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుంది. కొన్ని సార్లు నివాస, పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఈ కార్డు అవసరమవుతోంది.

డూప్లికేట్‌ కార్డు పొందడం ఇలా:
ఈ కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌ బూత్‌ నెంబర్, కార్డు నెంబర్‌తో రూ. 10 చెల్లిస్తే మీ సేవ కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చును. నెంబర్‌ ఆధారంగా స్థానిక తహసీల్దార్‌ కార్యలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డును ఉచితంగా అందజేస్తారు. మరింత సమాచారం కోసం   www. ceoap. in వెబ్‌సైట్‌లో సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చును.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top