ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ప్రత్యేక బస్సులు
Feb 11 2014 2:00 AM | Updated on Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి జరగనున్న పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్, ఇతర విషయాలను ఏజేసీ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయం కంటే ముందుగా, కేంద్రాలకు చేరేందుకు వీలుగా బస్సులకు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
117 కేంద్రాల్లో జరగనున్న ప్రాక్టీకల్ పరీక్షలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను నిర్దేశిత ప్రాంతాలను స్పీడ్‌పోస్టులో పంపించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పోస్టల్ అధికారులను కోరారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా ఉపతహశీల్దార్లను నియమించాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది సమ్మె లో ఉన్నందున..వారి స్థానంలో ఉప జిల్లా విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. పరీక్షా సామాగ్రిని భద్రపరిచేందుకు, తరలించేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.
మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు
మార్చి 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.అన్నయ్య చెప్పారు. జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు 20 రోజులు, థియరీ పరీక్షలు 16 రోజులుంటాయన్నారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యలు జి. అప్పలనాయుడు, డీఈవో ఎస్.అరుణకుమారి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం. సన్యాసిరావు, డీపీఆర్వో ఎల్.రమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement