సాంకేతికతతో నేరాల అదుపు

SP Yesu Babu Special Interview - Sakshi

జిల్లా వ్యాప్తంగా నిఘా కెమెరాలు

ఇప్పటి వరకు 300 కెమెరాలు ఏర్పాటు

మ్యాట్రిక్‌ ఆధ్వర్యంలో మరో 796 కెమెరాలు ఏర్పాటు

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టం డయల్‌ 100ను బలోపేతం

సైబర్‌ క్రైమ్స్‌పై అవగాహన సదస్సులు నిఘా వ్యవస్థ పటిష్టం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో సత్ఫలితాలు ఎస్పీ ఏసుబాబు పాలనకు ఏడాది

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాంకేతికతను ఉపయోగించుకుని జిల్లాలో నేరాల శాతాన్ని  దాదాపుగా తగ్గించినట్లు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పేర్కొన్నారు. ఈ నెల 26కు జిల్లాలో ఏడాది పదవి కాలం పూర్తి చేసుకున్న ఎస్పీ మంగళవారం సాక్షితో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాదిలో నేరాల శాతం బాగా తగ్గిందన్నారు. ముఖ్యంగా హత్యలు, దొంగతనాలు మరింతగా తగ్గాయన్నారు. సాంకేతికత సహకారంతో పోలీసులు మెరుగైన పనితీరును కనపరచడమే  ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఒంగోలు నగరంలో 92 కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో మొత్తం 300 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయడం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. మ్యాట్రిక్‌ సంస్థ ద్వారా జిల్లాలోని ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్ధంకి, దరిశి, కనిగిరి, చీమకుర్తి ప్రాంతాల్లో 796 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇందులో  ఆటోమెటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు, రెడ్‌లైట్‌ వైలేషన్‌ డిటెక్షన్, పేషియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు 250 ఉంటాయన్నారు. ఇప్పటికే కేబుల్‌ వర్క్‌ పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసి రాజధాని అమరావతిలోని కమాండ్‌ కంట్రోల్‌కు అను సంధానం చేయనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు. దీని వల్ల నేరాల శాతం మరింత తగ్గుతుందన్నారు.  డయల్‌ 100 కార్యక్రమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఒక్క కాల్‌ కూడా మిస్‌ కాకుండా ఎస్పీ కంట్రోల్‌లో మానిటరింగ్‌ ఉంటుందన్నారు. ఐ క్లిక్‌ మార్కాపురం, ఒంగోలులో మాత్రమే ఉందని, దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. సైబర్‌ క్రైమ్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.

షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సత్ఫలితాలను ఇస్తుందని చెప్పారు. దాబాల్లో వాహనాలు ఆపి మద్యం తాగుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని దీన్ని అరికట్టేందుకు హైవేల్లో వాహనాలను నిలపకుండా అడ్డుకున్నామన్నారు. దీన్ని వల్ల ప్రమాదాలు తగ్గినట్లు ఎస్పీ చెప్పారు. జిల్లాలో ఫ్యాక్షన్‌ హత్యలు లేవన్నారు. అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలు మాత్రమే అడపాదడపా జరుగుతున్నాయని ఎస్పీ చెప్పారు. దొంగతనాలు దాదాపు తగ్గిపోయాయన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. అటవీశాఖ అధికారులకు తమశాఖ నుంచి 20 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లను అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. నెల్లూరు నుంచి 20 మంది వైఎస్సార్‌ కడప నుంచి 60 మంది కానిస్టేబుళ్లు చందనం అక్రమ రవాణాను అరికట్టే టీముల్లో పాలు పంచుకుంటున్నారన్నారు. ఏడాదిలో ఒకటి రెండు పెద్ద ఘటనలు మాత్రమే జరిగాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకారం అందిస్తున్నారని ఎస్పీ సత్య  ఏసుబాబు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top