బీసీలకు ‘పథకాల’ పంట | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో సామాజిక న్యాయం

Published Thu, Jun 4 2020 4:07 AM

Social justice in welfare - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర జనాభాలో వారు అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల హయాంలో వారికి ఏ రంగంలోనూ తగిన వాటా లభించలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజ నాలకూ నోచుకోలేదు. కానీ, గత ఏడాది కాలంగా పరిస్థితి పూర్తిగా మారింది. ‘బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌’ అంటూ తన పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే చెప్పింది చెప్పినట్లుగా బీసీలకు అన్ని రంగాల్లో తగిన వాటా ఇచ్చారు. దీంతో చాలా రోజుల తర్వాత బీసీలకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత లభించింది. ఈ విషయంలో ఏడాదిలోనే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నవరత్నాల ద్వారా బీసీలకు అందించిన ఆర్థిక ప్రయోజనాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే వచ్చేవి. అదీ కూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. కానీ, గత ఏడాది ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా బీసీలు ఈ ఏడాది కాలంలో అధిక ఆర్థిక ప్రయోజనం పొందారు. 

ఇది ఎలా సాధ్యమంటే..
► ఎన్నికల ముందు చెప్పిన మేరకు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు చూడకుండా నవరత్నాల పథకాల కోసంప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించింది. 
► మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం.. సిఫార్సులకు ఎటువంటి ఆస్కారం లేకుండా వైఎస్సార్‌ నవశకం పేరుతో అర్హత గల ప్రతి ఒక్కరినీ నవరత్నాల పథకాలకు వలంటీర్ల ద్వారా గుర్తించారు.
► దీంతో ఎటువంటి వివక్షకు తావు లేకుండా అర్హులైన బీసీ వర్గాలన్నీ నవరత్నాల పథకాలకు అర్హులుగా తేలడమే కాక.. ఏడాది కాలంలో 15 పథకాల ద్వారా ఏకంగా 1.78 కోట్ల మందికి పైగా బీసీ వర్గాల వారు రూ.19,308 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం పొందారు. 

Advertisement
Advertisement