ఆ ఘుమఘుమలెక్కడ?!

Soaring Prices To Make Avakaya Much Dearer - Sakshi

పల్లెల్లో పెద్దగా కానరాని ఆవకాయ పచ్చళ్ల హడావుడి

తగ్గిన దిగుబడి.. పెరిగిన ధరలే కారణం

గతేడాది కన్నా గణనీయంగా తగ్గిన దిగుబడులు

ఒక్కో కాయ ధర రూ.15 నుంచి రూ.40

సాక్షి, ద్వారకాతిరుమల: వేసవి వచ్చిందంటేచాలు పల్లెల్లో ఆవకాయ పచ్చళ్లు ఘుమఘుమలాడేవి. కానీ ఈ ఏడాది గ్రామాల్లో ఆ హడావుడి అంతగా లేదు. పెరిగిన ఆవకాయ ధరలే దీనికి కారణం. గతేడాదే తక్కువగా ఉన్న కాపు ఈ ఏడాది మరీ తగ్గిపోయింది. దీంతో ఆవకాయ ధర అమాంతంగా ఆకాశానికెగసి సామాన్యుడికి అందకుండా ఉంది.  
        
దిగుబడి ఢమాల్‌
రాష్ట్రవ్యాప్తంగా 3,36,956 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. దీని ద్వారా ఏటా 40,43,472 మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వస్తోంది. అయితే ఈ ఏడాది కురిసిన విపరీతమైన మంచు, ప్రస్తుతం మండిపోతున్న ఎండలు.. వీటికి తోడు ఇటీవల ఈదురు గాలులు, అడపాదడపా కురుస్తున్న వడగండ్ల వానలతో దిగుబడులు సగానికి సగంపైగా çపడిపోయాయి. దీంతో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి రావడం కూడా కష్టమేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంటకూడా ప్రస్తుత తీవ్ర ఎండలకు ఉడికిపోయి రంగు మారుతోంది. దీంతో రైతు తన పంటను అమ్ముకునేందుకు తొందరపడుతున్నాడు. గతంలో ఇక్కడ పండిన పంట బరోడా, అహ్మదాబాద్, నాగపూర్, ఇండోర్, భోపాల్, జోద్‌పూర్, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతయ్యేది. అలాగే మామిడి ముక్కలు గుజరాత్‌లోని నడియాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లేవి. అయితే ఈసారి దిగుబడుల్లేక ఎగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అ‘ధర’హో
సాధారణంగా పచ్చళ్లకు దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి, చిన్నరసాలు, తెల్ల గులాబీ, సువర్ణరేఖ వంటి కాయలను వినియోగిస్తారు. అయితే ఈసారి అవి దొరకని పరిస్థితులు నెలకొనడంతో.. ఏం చేయాలో పాలుపోక పచ్చడి ప్రియులు సతమతమవుతున్నారు. ఒక వేళ మార్కెట్‌లో ఇవి దొరికినా ఒక్కో కాయ ధర పరిమాణాన్నిబట్టి రూ.15 నుంచి రూ.40 వరకు పలుకుతుండటంతో మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

గతేడాది కంటే మామిడి కాపు గణనీయంగా తగ్గింది. ఈదురు గాలులు, వడగాడ్పుల కారణంగా పంట బాగా దెబ్బతింది. అంతకు ముందు పూతను నిలుపుకొనేందుకు అధిక పెట్టుబడులు పెట్టి, చెట్లను కన్నబిడ్డల్లా కాశాం. అయినా దిగుబడి సరిగ్గా రాలేదు. పొలాల్లో అమ్మితేనే మాకు ఒక రూపాయి మిగులుతోంది. అలాకాక మార్కెట్‌కు తీసుకెళ్తే దళారుల వల్ల పెట్టుబడులను నష్టపోవాల్సి వస్తోంది. దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి వంటి కాయలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఒక్కో కాయ సైజును బట్టి రూ.40 వరకు పలుకుతోంది.
– ఘంటా వెంకట నరసింహరావు, రైతు, రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం

మామిడి కాయ ధరా.. అమ్మో!
మామిడికాయ ధర వింటే దడపుడుతోంది. మార్కెట్‌లో చిన్న మామిడి కాయ ధర రూ.15 పైచిలుకే పలుకుతోంది. ఇలాగైతే పచ్చళ్లు పెట్టుకోలేం. కొత్తపల్లి కొబ్బరి, దేశివాళీ కాయలు కొందామంటే రూ.30 నుంచి రూ.40 పలుకుతున్నాయి.
– అడపా సత్యన్నారాయణ, వినియోగదారుడు, ఈస్ట్‌ యడవల్లి, కామవరపుకోట మండలం

సందడి కనబడటం లేదు
ఏటా ఈ సమయానికి నిల్వ పచ్చళ్లు పెట్టేసేవాళ్లం. ఈ సారి మామిడికాయ దొరక్క ఇంకా పచ్చళ్లు పెట్టలేదు. ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మామిడి కాయల ధరతో పాటు.. పచ్చళ్ల తయారీకి వినియోగించే మిగతా సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి.         
– కావేటి దేవి, గృహిణి, కొత్తపేట, జంగారెడ్డిగూడెం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top