ట్రిపుల్‌ సెంచరీ మామిడి చెట్టు | Triple Century Mango Tree is a real horticultural marvel in India! | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ సెంచరీ మామిడి చెట్టు

Jul 13 2025 8:12 AM | Updated on Jul 14 2025 5:26 PM

Triple Century Mango Tree is a real horticultural marvel in India!

చెట్టు ఒక్కటే కానీ, అందులోని ఒక్కో పండు ఒక్కోరకం సినిమాలా కనిపిస్తుంది. ఒకటి రొమా¯Œ ్స, మరొకటి యాక్షన్, ఇంకొకటి కామెడీ! మొత్తం 300 కథలు, 300 రుచులు, 300 క్యారెక్టర్లతో మల్టీప్లెక్స్‌ను తలపిస్తుంది ఈ మామిడి చెట్టు. ఆ మల్టీప్లెక్స్‌ క్రియేటర్, డైరెక్టర్, ఓనర్‌... ‘మామిడి మాస్టర్‌’ కలీముల్లా ఖాన్‌ !మలీహాబాద్‌లో అతన్ని అందరూ ‘మ్యాంగో మేన్‌’ అంటారు. వయసు 82. వయసులో వృద్ధుడే అయినా, మామిడి మీద ఆయన ప్రేమలో మాత్రం నిత్యయవ్వనం తొణికిసలాడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, తోటపని చేస్తాడు. 

ఆ తర్వాత అలసిపోయి, నిద్రపోతాడు. ఆ నిద్రలో వచ్చే కలల్లో కూడా తన 120 ఏళ్ల మామిడి చెట్టుతోనే కాలక్షేపం చేస్తాడు. చెప్పుకోడానికి చెట్టు ఒకటే కాని, ఆ చెట్టుకే తాను వేసిన అంటు కొమ్మలకు మూడు వందల రకాల మామిళ్లు కాస్తున్నాయి. ఒక్క చెట్టులోనే ఇన్ని రకాలా? అని చూసినవారు నోరెళ్లబెడుతుంటారు. కరీముల్లాకు మాత్రం ఆ చెట్టు పండ్లు కన్నబిడ్డల్లాంటివి. అందుకే, వాటికి పేర్లు కూడా పెడతాడు. ఒక రకం మామిడికి ‘ఐశ్వర్యా’ అని పేరు పెట్టాడు – బాలీవుడ్‌ నటి గుర్తుందా? ఆమె పేరునే ఒక మామిడి రకానికి పెట్టాడు.  (సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు)

ఎందుకంటే ఆ పండు చూసినా, తిన్నా, తీయదనం చూసినా, ప్రేమలో పడేలా ఉంటుందట! ఒక కిలోకు మించిన బరువు, చర్మం మీద ముదురు ఎరుపు రంగుతో ఉంటుంది. ఇంకొకటి ‘సచిన్‌ మామిడి’– అది తింటే స్టేడియంలో సెంచరీ కొట్టినట్టే! పొట్టిగా ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. ‘మోదీ మామిడి’ కూడా ఉంది– ఇది బాగా బలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వాసనలతో ఉంటుందని. ఇంకో మామిడికి ‘అనార్కలి’ అని పేరు పెట్టాడు. ఇలా మొత్తం మామిడి రకాలకు పేర్లు పెట్టాడు. తాజాగా ‘రాజ్‌నాథ్‌ మామిడి’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరుతో కొత్త రకం మామిడి పండింది. ఇతని కృషికి మెచ్చి ప్రభుత్వం 2008లో పద్మశ్రీ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కలీముల్లా ఖాన్‌కు నాలుగు వందలకు పైగా అవార్డులు ఉద్యాన విభాగంలో వచ్చాయి. 

అసలు రహస్యం!
ఇదంతా అతని గ్రాఫ్టింగ్‌ టెక్నిక్‌ వలనే సాధ్యం అయింది. అంటే, మామిడి చెట్టులో ఒక కొమ్మను చెక్కి, దానిలో మరో రకానికి చెందిన మామిడి కొమ్మను అంటుకట్టి, టేప్‌ పెడతాడు, అది చెట్టులో కలిసి ఎదిగేలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ కొమ్మ కలిసిపోయిన తర్వాత, రెండేళ్లలో కొత్త మామిడి రకం జన్మిస్తుంది. ఇదంతా తన తాత తనకు నేర్పాడట! పద్దెనెమిదేళ్ల వయసులో కలీముల్లా అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాడు. అప్పటి నుంచి గత ఆరు దశాబ్దాలుగా వివిధ రకాల కొమ్మలను అంటు కడుతూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. రసాయనాలు చల్లి పండ్లు పండించకుండా, చెట్టుతో మాట్లాడుతూ, ప్రేమగా పెంచుతున్నాడు. అందుకే ఆ చెట్టు కూడా వివిధ రకాల మామిళ్లతో తిరిగి, ప్రేమను అందిస్తోంది. 

ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!

ప్రస్తుతం ఆ చెట్టు తొమ్మిది మీటర్ల ఎత్తులో నిలబడి, చల్లని నీడను ఇస్తోంది. చెట్టు ఆకులు కూడా ఒక్కో చోట ఒక్కో రంగులో కనిపిస్తాయి. ఒకచోట ముదురాకుపచ్చ, ఇంకోచోట మెరిసే పసుపు ఆకులు, మరోచోట ముదురు ఊదా ఆకులు– ఇలా కేవలం ఆకులు మాత్రమే కాదు, ఈ చెట్టు పండ్లు వెదజల్లే పరిమళాలు కూడా వేర్వేరు. చివరగా కరీముల్లా మాటల్లో – ‘మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాని, ఈ మామిళ్లు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. వాటి వాసనలో, రుచిలో, పేర్లల్లో ఎన్నో కథలు దాగున్నాయి. అచ్చం మన వేలిముద్రల్లాగానే ఒక్కో మామిడి ఒక్కో రకం’. పనిలో పనిగా మీరు చెప్పండి – మీకిష్టమైన మామిడి ఏది? ‘ఐశ్వర్యా’ తినాలనిపిస్తుందా? లేక ‘సచిన్‌’ను రుచి చూస్తారా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement