వెంకన్నా... నీ సన్నిధిలో రక్షణ లేదా! | Snake bites 5-year-old girl, woman at Tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నా... నీ సన్నిధిలో రక్షణ లేదా!

Jul 14 2014 9:51 AM | Updated on Oct 22 2018 2:22 PM

వెంకన్నా... నీ సన్నిధిలో రక్షణ లేదా! - Sakshi

వెంకన్నా... నీ సన్నిధిలో రక్షణ లేదా!

ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా..! అంటూ భక్తితో తిరుమలకొండకు చేరుతున్న శ్రీవారి భక్తులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి.

ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా..! అంటూ  భక్తితో తిరుమలకొండకు చేరుతున్న శ్రీవారి భక్తులకు  అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ప్రయాణం, బస, తలనీలాలు, శ్రీవారి దర్శనం.. కొండకు చేరిన భక్తులకు అన్నిటిలోనూ కష్టాలు తప్పడం లేదు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామంటూ గొప్పాలు చెప్పుకునే టీటీడీ ...మాటలకే తప్ప చేతలు శూన్యం. గదులు నుంచి దర్శనం వరకూ వీఐపీలకు అడుగడుగునా.... వడ్డించిన విస్తరి అయితే ... సామాన్య భక్తులు మాత్రం వెంకన్న సాక్షిగా ప్రత్యక్ష నరకమంటే ఏంటో చవి చూస్తారనేది జగమెరిగిన సత్యం.

టీటీడీ తిరుమల వెంకన్న అందరివాడు.. అందరి కష్టాలను కడతేర్చేవాడు.. ఆపద మొక్కుల వాడు.. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా ఆస్వామే దిక్కని అందరూ నమ్ముతారు. అందుకే కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని.. ముడుపులు చెల్లిస్తారు.. అలాంటి స్వామి సన్నిధిలోనే రక్షణ లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. క్షణకాలం దొరికే ఆ స్వామి దర్శనం కోసం ఎన్నో మైళ్లు.. మరెన్నో ఊళ్లు దాటి స్వామి సన్నిధికి చేరుకుంటారు.

రోజుకు లక్ష మంది వచ్చే తిరుమలకొండపై ప్రయాణం, బస, తలనీలాలు, శ్రీవారి దర్శనం... వంటి అన్ని చోట్లా భక్తులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు. ప్రతి చోటా రద్దీని బట్టి కనీసం గంట నుంచి 30 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మొక్కులు చెల్లించేందుకు సకుటుంబ సమేతంగా వచ్చిన భక్తులకు తిరుమలకొండపై ఎన్ని కష్టాలు ఎదురైనా వారు చలించకుండా అన్ని బాధలను దిగమింగుకుని, చాలా ఓర్పుతో క్యూలలో వేచి ఉంటూ మొక్కులు చెల్లించి స్వామి దర్శనంతో అప్పటివరకూ పడిన కష్టాలు మరచిపోతుంటారు.

ఇప్పటికే సరైన వసతలు లేక అల్లాడుతున్న సామాన్య భక్తులకు తాజాగా పాముల బెడద పట్టిపీడిస్తోంది. ఆదివారం పట్టపగలే ఓ పాము క్యూలో దూరి ఇద్దరు భక్తులను కాటేసింది. దాంతో వారిద్దర్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. దీనికి తోడు నాలుగురోజుల ముందు చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందగా, పది మంది గాయాలపాలయ్యారు. ఇవన్నీ శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఊహించని కష్టాలు. అంతు చిక్కని పరీక్షలు. అయితే అనుకోని సంఘటనలు జరుగుతున్నా టీటీడీ మాత్రం నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నచందంగా ఎన్ని విమర్శులు వచ్చినా పట్టించుకోకపోవటం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement