సునీత సంగీత విభావరికి అనుమతి నిరాకరణ

Singer Sunitha Programme Stopped Srikakulam Police - Sakshi

పోలీసులు అడ్డుకోవడంతో

ఆలస్యంగా ప్రారంభమైన కార్యక్రమం

శ్రీకాకుళం: నగరంలోని వైఎస్సార్‌ కూడలిలో నగరపాలకసంస్థ మైదానంలో గురువారం సాయంత్రం ప్రారంభం కావాల్సిన సినీ గాయని సునీత గీతాలాపన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంగీత విభావరి ఆలస్యంగా ప్రారంభమైంది. పర్యాటకశాఖ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ నిర్వాహకుడికి ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో జనం కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిసినప్పటికీ నిర్వాహకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో తెలియడం లేదు.

వేదికపై గాయని సునీత
పోలీసులు జోక్యం చేసుకొని కార్యక్రమాన్ని నిలుపుదల చేసిన తర్వాత టూరిజం అధికారి నారాయణరావు ఎస్పీ వద్దకు వెళ్లి అనుమతి కోరారు. ఆయన అనుమతి ఇచ్చే సరికి 8 గంటల సమయం దాటింది. ఇదిలా ఉంటే నగరపాలకసంస్థ మైదానంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని గతంలో పాలకవర్గం తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా మూడేళ్లపాటు ఎటువంటి అధికారిక, అనధికారిక, ప్రైవేటు కార్యక్రమాలు జరగలేదు. గతేడాది పీఎస్‌ఎన్‌ఎం హెచ్‌స్కూల్‌ ఆవరణలో ఓ వాణిజ్య ప్రదర్శన నిర్వహిస్తుండగానే మరో వాణిజ్య ప్రదర్శనకు అనుమతి ఇచ్చి ఈ మైదానాన్ని కూడా కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పట్లో ఈ మైదానాన్ని వాణిజ్య ప్రదర్శనకు కేటాయించారు. ఆనాటి నుంచి కౌన్సిల్‌ తీర్మానం సైతం తుంగలోకి తొక్కినట్లయింది. ఇప్పుడు మరో ప్రైవేటు కార్యక్రమానికి ఈ మైదానాన్ని కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top