గురువులకు షోకాజ్‌ నోటీసులు

Show Cause Notice to Teachers in YSR Kadapa - Sakshi

టెన్త్‌ ఫలితాలపై డీఈఓ సీరియస్‌

మ్యాథ్స్‌లో ఎక్కువ మంది ఫెయిల్‌

హెచ్‌ఎం,ఎంఈఓలతో ఆరా

బాధ్యుల నుంచి వివరణకు నోటీసులు

పునరావృతమైతే తీవ్రచర్యలు

ఉత్తీర్ణత పెంపునకు కసరత్తు ప్రారంభం

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది పది ఫలితాలు ఆశించినమేర లేవు. గతేడాది కంటే ఒక అడుగు వెనక్కువేసి 11వ స్థానంలో నిలవడంతో  పాటు కొన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణతశాతం బాగా తగ్గింది. దీనిని  డీఈఓ శైలజ సీరియస్‌గా తీసుకున్నారు. ఉత్తీర్ణతశాతం ఎందుకు తగ్గింది..దీనికి కారణాలేంటనే విషయంపై ఒక్కోరోజు కొన్ని మండలాలకు సంబంధించిన ఆయా హైస్కూల్స్‌  ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఆ డివిజన్‌కు సంబంధించిన డిప్యూటీ డీఈఓలతో నిత్యం డీఈఓ కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోతుగా చర్చించి ఆరా తీస్తున్నారు. ఏడాదిపాటు బోధనలు అందిస్తే కనీసం పాస్‌మార్కులు కూడా విద్యార్థి సంపాదింకుంటే ఎలా అని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని పేపర్లు కఠినతరంగా వచ్చాయిని కొందరు హెచ్‌ఎంలు, ఎంఈఓలు బదులిచ్చారు. దీనిపై ఆమె కొంత సీరియస్‌ అయినట్లు సమాచారం. ఉత్తీర్ణత తగ్గిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోపాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు నోటీస్‌లు కూడా జారీ చేసి వివరణ అడిగినట్లు తెలిసింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొదటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.

సబ్జెక్టుల బాధ్యత ఆయా ఉపాధ్యాయులదే...
ఏఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారో  సంబంధిత ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని డీఈఓ ఆదేశించినట్లు తెలిసింది. వారికి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే వరకు సబ్జెక్టు నిపుణులు రోజూ ప్రత్యేక తరగతులను నిర్వహించి పాస్‌ ఆయ్యేందుకు కృషి చేయాలని ఆదేశాలను ఇచ్చారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ బోధనలను అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 36536 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 33943 మంది పాసయ్యారు.  తెలుగు.. ఉర్థూ సబ్జెక్లులో 4299 మందికి ఏ1 గ్రేడ్‌ వచ్చింది. 7274 మందికి ఏ2 గ్రేడ్‌ వచ్చింది. ఇంగ్లీషలో 1193 మందికి ఏ1. 3730 మందికి ఏ1 గ్రేడ్‌ అలాగే హిందీలో 3348 మందికి ఏ1, 8301 మందికి ఏ2, మ్యాథ్స్‌లో 1930 మందికి ఏ1, 8390 మంది ఏ2, సైన్సు సబ్జెక్టుకు సంబంధించి 1645 మందికి ఏ1, 3983 మందికి ఏ2, సోషల్‌ సబ్జెక్టులో 3083  మందికి ఏ1, 6891 మందికి ఏ2 గ్రేడ్స్‌ వచ్చాయి. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి 15,498 మందికి ఏ1, 34069 మందికి ఏ2 గ్రేడ్స్‌ వచ్చాయి. 28118 మంది బి1, 20505 మందికి బి2, అలాగే 13400 మందికి సి1, 5397 మందికి సీ2 గ్రేడులు రాగా 363 మందికి డి గ్రేడులు వచ్చాయి. 2830 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారు. మ్యాథ్స్‌తోపాటు సైన్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. మ్యాథ్స్‌లో 1872 మంది ఫెయిలయ్యారు. సైన్సులో 545 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. సోషల్‌లో 126 మంది, హిందీలో 124 మంది, తెలుగు, ఉర్దూల్లో 115 మంది ఫెయిల్‌ అయ్యారు. వీరందరికి ప్రస్తుతం అయా సబ్జెక్టు ఉపా«ధ్యాయులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.

సమీక్షలు నిర్వహిస్తున్నాం...
పది ఫలితాలపైన నిత్యం పలు మండలాలకు సంబంధించిన హెచ్‌ఎంలతోపాటు ఎంఈఓలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తక్కువ ఉత్తీర్ణతశాతం వచ్చినందుకు గల కారణాలపై  అరా తీçస్తున్నాం. మరీ తక్కుమంది ఉత్తీర్ణలైన చోట్ల అయా సబ్జెక్టు టీచర్లకు వివరణ కోరుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ఈ పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచి ప్రణాళణ మొదలు పెట్టాం.    – శైలజ, జిల్లా విద్యాశాకాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top