రబీ కోసం వ్యవసాయ శాఖ ఇంకా సమాయత్తం కాలేదు. సీజన్ ప్రాంభమైనా రబీ కార్యాచరణ రూపకల్పన అసంపూర్తిగానే మిగిలిపోయింది.
సాక్షి, సంగారెడ్డి: రబీ కోసం వ్యవసాయ శాఖ ఇంకా సమాయత్తం కాలేదు. సీజన్ ప్రాంభమైనా రబీ కార్యాచరణ రూపకల్పన అసంపూర్తిగానే మిగిలిపోయింది. సాగు విస్తీర్ణం, ఎరువులు, విత్తనాల వినియోగంపై అంచనాలతో కార్యాచరణను రూపొందించిన అధికారులు.. వివిధ వ్యవసాయ ప్రోత్సాహక పథకాలపై ప్రణాళికలను అందులో పొందుపరచలేదు. భూ చేతన, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, పొలంబడి, ఐసోపాం, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, వడ్డీ లేని రుణాలు, ఆత్మ, భూసార పరీక్షలు, విత్తనోత్పత్తి, పంట బీమా తదితర కార్యక్రమాలపై ప్రణాళిక నివేదికలు ఇంకా సిద్ధం కాలేదు. వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయం కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సొంత వ్యవహారాల్లో తీరిక లేకపోవడంతో కీలక రబీ కార్యాచరణ మరుగునపడిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే ఇలా ఉంటే సమీప భవిష్యత్తులో రైతన్నలకు కష్టాలు తప్పవని తెలుస్తోంది. అధికారుల అంచనాల ప్రకారం రబీ సాగు విస్తీర్ణం భారీగా పెరగనుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. లేకుంటే విత్తనాలు, ఎరువులు, రుణాలు, విద్యుత్ సరఫరా సమస్యలు అన్నదాతలు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదముంది.
వరిపై గురి
ఈ ఏడాది భారీ వర్షాలు పడడంతో రబీ సాగు విస్తీర్ణం బాగా పెరగనుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరిసాగుపై భారీ అంచనాలు రూపొందించింది. గత రబీలో 22 వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగైతే ఈ సారి 62 వేల హెక్టార్లకు పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. 41,818 హెక్టార్లతో ఆ తర్వాతి స్థానంలో శనగ ఉండనుందని అంచనా వేశారు. రబీలో వరి, శనగ విత్తనాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని అధికారులు అంచనా వేశారు. గత ఖరీఫ్‌లో విత్తనాలను సకాలంలో సరఫరా చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. రబీలో విత్తనాల పంపిణీ ఇంకా సిద్ధం కాలేదు.
ఎరువులు 71 వేల టన్నులు
రబీ అవసరాల కోసం 33,199 మెట్రిక్ టన్నుల యూరియా, 8,772 మెట్రిక్ టన్నుల డీఏపీ, 20,831 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 8,544 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాకు మొత్తం 71,346 మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని ప్రతిపాదించింది.