జనసీమ

జనసీమ


 రాజన్న తనయకు జిల్లా ఉద్యమాహ్వానం




  అవనిగడ్డలో అడుగడుగునా అశేష జనవాహిని




  సమైక్యస్ఫూర్తిని రగిలించిన షర్మిల ప్రసంగం

 

దివిసీమ జనసీమైంది. ఎవడబ్బ సొమ్మురా ఈ గడ్డ చీల్చ.. ఈ కుట్రలు, కుతంత్రాలను దునుమాడగ..తెలుగువీరా లేవరా.. దీక్షబూని సాగరా..అంటూ జనచేతన పతాకై సమైక్య సమర శంఖం పూరించిన వైఎస్ షర్మిలకు అపూర్వస్వాగతం పలికింది. వర్షం వచ్చినా, ఆమె రాక ఆలస్యమైనా జనం ఉత్సాహం, ఉత్సుకతతో ఎదురుచూశారు. సమైక్యవాదుల కవాతుతో అవనిగడ్డ కడలికెరటమైంది. జైజగన్, జైసమైక్యాంధ్ర నినాదాలు దిక్కులు పిక్కటిల్లాయి.

 

సాక్షి ప్రతినిధి, అవనిగడ్డ : దివిసీమ జనసునామితో పోటెత్తింది. అవనిగడ్డ జనసంద్రమైంది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమైక్య శంఖం పూరించటానికి జిల్లాకు వచ్చిన వైఎస్ షర్మిలను చూసేందుకు జనం కడలి కెరటమై కదిలారు. అడుగడునా అపూర్వ స్వాగతం పలికారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర బుధవారం రాత్రి 9గంటలకు జిల్లాలోకి ప్రవేశించింది. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీవోలు పెద్ద ఎత్తున పులిగడ్డ వారధి వద్దకు చేరుకుని ఆమెను జిల్లాలోకి సాదరంగా తోడ్కొనివచ్చారు. దారిపొడువునా గంటల తరబడి తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరికి అప్యాయంగా పలకరిస్తూ బస్సుయాత్ర ద్వారా షర్మిల అవనిగడ్డలోని బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు.

 

జన మే జనం



 షర్మిలకు స్వాగతం పలికేందుకు పులిగడ్డ- పెనుమూడి వారధి వద్దకు అనూహ్య సంఖ్యలో జనం తరలివచ్చారు. జైజగన్, జైసమైక్యాంధ్ర నినాదాల నడుమ షర్మిల బస్సు యాత్ర జిల్లాలో సాగింది. అడుగడుగునా ప్రజలు వెల్లువలా ఎదురేగి స్వాగతం పలకడంతో యాత్ర నిర్ణీత షెడ్యూల్ కన్నా నాలుగు గంటలు అలస్యంగా అవనిగడ్డకు చేరుకుంది. జోరు వర్షం కురుస్తున్నా జనం లెక్కచేయలేదు.  షర్మిలను చూసేందుకు, అమె సమైక్య ప్రసంగాన్ని వినేందుకు అసక్తి చూపారు. ఆమె కూడా దారిపొడవునా ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆమె అవనిగడ్డ బస్టాండ్ సెంటర్ చేరుకోగానే జనం పెద్దపెట్టున నినాదాలు చేశారు. అశేష జనవాహినినుద్దేశించి తొలుత పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రసంగించారు.



 మీ రాజన్న కూతురును....



 మీరాజన్న కూతుర్ని... జగనన్న చెల్లెల్ని అంటూ షర్మిల ప్రజలకు అభివాదం చేసి తన ప్రసంగం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలి.. కోట్లాది మంది ప్రజలు ఎందుకు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలు ఏమిటి తదితర అంశాలను వివరిస్తూ తీవ్ర ఉద్వేగంగా ఆమె చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. తెలుగుజాతి ఒక్కటిగా నిలవాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారని, ఆకాంక్షించారని ఆమె గుర్తుచేశారు. సమైక్య స్ఫూర్తి రెట్టించేలా షర్మిల ఎంతో భావోద్వేగంతో తన ప్రసంగం కొనసాగించిన తీరు అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అకాంక్షించే ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీనేనని ప్రజల హర్షధ్వానాల నుడుమ ఆమె సుస్పష్టంచేశారు.



విభజన జరిగితే.. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన భూములు  ఉప్పు కల్లాలుగా మారిపోతాయని వివరించారు.  రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆమె దుయ్యబట్టారు. సీమాంధ్రకు కృష్ణా నది నీరు రాకపోతే కుప్పం నుంచి కృష్ణాజిల్లా వరకు సముద్రపు నీరే దిక్కు అవుతుందని అన్నారు. చంద్రబాబు అవినీతిపై సమగ్ర విచారణ జరిగితే ఎప్పుడో జైలుకు వెళ్లేవారని ఆమె పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడ్ని నిలదీయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్,  చంద్రబాబునాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టిన క్రమంలో ప్రజలు చప్పట్ల మోత మోగించారు. దాదాపు 15 నిమిషాల పాటు షర్మిల ప్రసంగించారు.



 హాజరైన ముఖ్యనేతలు



 పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్తలు సింహద్రి రమేష్‌బాబు, గుడివాక శివరావు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్నినాని, మేకాప్రతాప అప్పారావు, అంబటి రాంబాబు, సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ తాతినేని పద్మావతి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డి, పెడన నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ నేతలు, వేల్పుల రవికుమార్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top