ఆకతాయిల అణచివేతకు... పరాశక్తి

Shakthi Teams For Women Safety in Srikakulam - Sakshi

జిల్లా పోలీసు శాఖలో నూతన విభాగం

మహిళలు, యువతులకు రక్షణ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల పరిసరాలు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. కళాశాలకు వచ్చే విద్యార్థినులనే కాదు ఆ రోడ్డుమార్గంలో వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధించిన దాఖలాలు కోకొల్లలు! బాధితులు అవమానపడుతుంటే ఆనందం పొందడం ఆ ఆకతాయిలకు అలవాటుగా మారింది!

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో, పరిసరాల్లో జులాయిగాళ్ల బెడద ఎక్కువైంది. చేతిలో రెండు పుస్తకాలు లేదంటే భుజాన చిన్న బ్యాగు వేసుకొని ఫోజులిస్తూ ఆడపిల్లలు కనిపిస్తే చాలు వెకిలి చేష్టలతో ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ బాధ మహిళా ప్రయాణికులకూ తప్పట్లేదు!కళాశాలలు, బస్టాప్‌లే కాదు సినిమా థియేటర్లు, పార్కులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు... ఇలా ప్రతి చోట ఆకతాయిలతో మహిళలు,యువతులు,బాలికలకు వేధింపులు తప్పట్లేదు. ఇక వారి ఆటలు చెల్లవు!

బాధితులెవ్వరైనా 100 నంబరుకు లేదంటే 1098 నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు... క్షణాల్లో ‘శక్తి’టీమ్‌ వాలిపోతుంది. అంతేకాదు ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఆయా ప్రాంతాల్లో మాటువేసి ఆకతాయిల ఆట కట్టిస్తారు! ఇదేదో ఒక రోజు లేదంటే వారం రోజుల వ్యవహారం కాదు! పూర్తిస్థాయిలో అన్నివేళలా మహిళా రక్షణకు మేమున్నామంటూ పనిచేయడానికి ఏర్పాటైనదే ‘శక్తి’! అరాచకాల నిరోధమే లక్ష్యంగా పోలీసుశాఖలో కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక విభాగం ఇది. గురువారం రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఈ విభాగాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు.

జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యల వంటి దారుణాలే గాకుండా ఇటీవల కాలంలో బాలికల మిస్సింగ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. వీటికి తోడు కళాశాలలు, బస్టాప్‌లు, వాణిజ్య సముదాయాలు వంటి రద్దీ ప్రాంతాల్లోనే కాదు రాత్రిపూట ఆటో ప్రయాణాల్లోను, నిర్జన ప్రదేశాల్లోనూ ఆకతాయిలు కాపుకాసి మహిళలను, యువతులను, బాలికలను వేధిస్తున్న దాఖలాలు అనేకంగా చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా బాధితుల్లో చాలా మంది పోలీసుస్టేషన్‌కు వెళ్లట్లేదు. అవమానభారంతో లోలోనే కుమి లిపోతున్నారు. కొంతమంది విద్యార్థినులైతే అర్ధంతరంగా చదువే మానేసి ఇంటికే పరిమితమైపోతున్నారు. కలలు కల్లలైపోతున్నాయనే బాధనైనా ఓర్చుకుంటున్నారు కానీ ఆకతాయిల ఆగడాలను తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తమను రక్షించేవారెవ్వరైనా ఉం డాలని కోరుకోవడం సహజం. ఇలాంటి సందర్భాల్లో స్పందించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఇతరత్రా కేసుల దర్యాప్తు, ప్రోటోకాల్, ట్రాఫిక్‌ వంటి పనులే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు, యువతుల రక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ఆచరణ రూపమే ‘శక్తి’!

తెలంగాణ ‘షి’ స్ఫూర్తిగా...
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ‘షి’ టీమ్స్‌ తమదైన పనివిధానంతో ప్రశంసలు అందుకుంటున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాప్‌లు, కళాశాలలు ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లో నిఘావేసి ఆకతాయిల ఆట కట్టించడంలో సఫలమవుతున్నాయి. దీంతో ఆకతాయిల ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ కేసులు చాలావరకూ తగ్గుముఖం పట్టాయి. ఈ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘శక్తి’ పేరుతో ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆచరణలో భాగంగా జిల్లాలో 28 మంది మహిళా పోలీసులతో మూడు టీములు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస–కాశీబుగ్గ స్టేషన్ల పరిధిలో వారు పనిచేస్తారు.

డీఎస్పీ పర్యవేక్షణలో...
మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ ఎంవీవీఎస్‌ మూర్తి నోడల్‌ అధికారిగా ఉంటారు. ఆయన పర్యవేక్షణలో శక్తి టీమ్స్‌ పనిచేస్తాయి. ఈ టీమ్స్‌లోని మహిళా పోలీసులకు విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక యూనిఫాంతో పాటు ప్రత్యేక ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేశారు. వాటికి ఏఆర్‌వీటీఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్ల సహాయంతో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, విద్యార్థినులపై ర్యాగింగ్‌ వంటి ఘటనలు జరిగినట్లు ఎక్కడ నుంచి ఫోన్‌ వచ్చినా, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు సమాచారం వచ్చినా శక్తి టీమ్‌ అక్కడికి చేరుకుంటుంది. ఆకతాయిలను పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ చేస్తారు. సంఘటనలో నేర తీవ్రతను బట్టి కేసు నమోదు చేస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top