ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం | seeds ready to kharif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం

May 28 2014 3:28 AM | Updated on Sep 2 2017 7:56 AM

ఖరీఫ్ సీజన్‌కు రాయితీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పలు రకాల విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు సిద్ధం చేసింది.

ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ :  ఖరీఫ్ సీజన్‌కు రాయితీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పలు రకాల విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు సిద్ధం చేసింది. ప్రస్తుతం జొన్న 10 క్వింటాళ్లు, సజ్జ 90, మొక్కజొన్న 50, పెసర 200, మినుము 150, కంది 1500, నువ్వులు 110, ఆముదం 50, వేరుశనగ 3000, జీలుగ 700, పిల్లిపెసర 800, జనుము 300 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ ఏడీఏ రత్న ప్రసాద్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. వేరుశనగ విత్తనాల ధర క్వింటా రూ.1,500, కంది  రూ.1,950, మినుము రూ.2,450, పెసర క్వింటా రూ.2,925, కొర్రల ధర క్వింటా రూ.1,300తోపాటు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, ఆముదం విత్తనాలు క్వింటా ధర రూ.2,500 చొప్పున రాయితీపై ఇస్తామన్నారు. అంతేగాక వరి ఆరు వేల క్వింటాళ్లు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

 జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3,38,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. గతేడాది 3,35,898 హెక్టర్లలో వరితో పాటు వేరుశనగ, మిరప, సజ్జల తదితర పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కంది, పత్తి, మినుము అధికంగా సాగవుతుందని అంచనా. దర్శి, త్రిపురాంతకం, తర్లుపాడు ప్రాంతాల్లో కంది ఎక్కువగా సాగు చేస్తారు. కందితో పాటు సజ్జ, జొన్న, ఆముదం పంటలు అధికంగా సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరి విత్తనాలకు రాయితీ లేదని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో కొంత చల్లబడడం, అరకొరగా కురిసిన వర్షాలతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. సమృద్ధి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా వర్షాలు కురిస్తే భూమిని సారవంతం చేసుకోవడానికి జీలుగా, పిల్లిపెసర, జనుము విత్తనాలు సగం రాయితీపై ఇవ్వనుంది.

 694 ఎరువుల నమూనాల సేకరణ లక్ష్యం
 ఈ ఏడాది 694 ఎరువుల నమూనాల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు నత్రజని 16, భాస్వరం 160, డీఏపీ 96, పొటాష్ 31, కాంప్లెక్స్ ఎరువులు 150, మిక్చర్స్ 90, మరోరెండు రకాల ఎరువుల నమూనాలను సేకరించినట్లు ఏడీఏ జి. రత్నప్రసాద్ తెలిపారు. అదే విధంగా భూసార పరీక్షలకు ఇప్పటి వరకు 4,400 మట్టి నమూనాలు ల్యాబ్‌లకు చేరాయని తెలిపారు. 1000కిపైగా పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement