కొత్త సమస్య! | seats in the ruling party in problems | Sakshi
Sakshi News home page

కొత్త సమస్య!

Mar 18 2016 4:36 AM | Updated on Sep 3 2017 7:59 PM

కొత్త   సమస్య!

కొత్త సమస్య!

అధికార పార్టీలో కొత్త నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై పాత నేతలు మండిపడుతున్నారు.

అధికార పార్టీలో సీట్ల లొల్లి
మేం ఎప్పుడు వచ్చినా  ముందే..
టీడీపీ నేతలతో అధికార పార్టీ తాజా నేత వ్యాఖ్య
మండిపడుతున్న ఓ వర్గం నేతలు
కార్యకర్తల్లో గందరగోళం

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో కొత్త నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై పాత నేతలు మండిపడుతున్నారు. పార్టీ గెలిచిన తర్వాత వచ్చి చేరితే ప్రాధాన్యతనిస్తూ.. ముందు నుంచి ఉన్న తమకు వెనుక కుర్చీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పుండు మీద కారం చల్లినట్టు.. మేం ఎప్పుడు వచ్చినా ముందు సీటే అని కొత్తగా పార్టీలో చేరిన నేత వ్యాఖ్యానించడం పట్ల అధికార పార్టీలోని ఒక వర్గం నేతలు అగ్గిమీద గుగ్గిలంఅవుతున్నారు. ఈ పరిస్థితితో తమ వెనుకనున్న కార్యకర్తలకు ఏం సందేశం పంపుతున్నారనే చర్చ జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సీఎంతో పాటు హెలికాప్టర్‌లోనే సదరు నేత దిగారు. అంతేకాకుండా సమావేశంలోనూ ముందు వరుస కుర్చీలో కూర్చున్నారు. ఇది చూసి.. మూడో వరుసలో కూర్చున్న అధికార పార్టీ నేతలు తమ పరిస్థితి ఇలా తయారయిందేమిటనే ఆలోచనలో పడిపోయారు.

 ఎప్పుడు వచ్చామన్నది కాదు..
 ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా... ఇది ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను కొత్తగా పార్టీలో చేరిన నేత వ్యాఖ్యానించడం పాత నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ఎప్పుడు వచ్చినా ముందు వరుస మాదేనని తన వ్యతిరేక వర్గం నేతలకు వినపడేలా మార్చి 8న కర్నూలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మూడో వరుసలో కూర్చున్న ఆ పార్టీ నేతలకు ఈ వ్యాఖ్యలు కాస్తా మింగుడు పడలేదు. దీంతో అధికార పార్టీలో తమ స్థానం ఏమిటని ఈ నేతలు చర్చించుకోవడం గమనార్హం.

 మా స్థానం ఇదేనా?
ఎన్నికల ముందు పార్టీలో చేరి.. పార్టీ కోసం కష్టపడితే తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త నేతలకు అగ్రస్థానం ఇవ్వడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా తమ పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. ఇది కాస్తా అంతిమంగా పార్టీకే ఇబ్బంది కలిగిస్తుందనే విషయాన్ని అధినేత గుర్తించాలని విన్నవిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో చేరికల వ్యవహరం రోజురోజుకీ కొత్త మలుపులకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement