
సాక్షిప్రతినిధి, విజయనగరం: సొంత మామకు వెన్నుపోటు పొడిచిన తమ అధినేతనే ఆదర్శంగా తీసుకున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు. స్వపార్టీలోనే వేరుకుంపట్లు రాజేసి వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం తెరవెనుక కుట్రలకు తెగబడుతున్నారు. సిట్టింగులనూ వదలకుండా వ్యతిరేక గ్రూపులు కట్టి ప్రత్యక్ష మాటల దాడులకు దిగుతున్నారు. తాజాగా చీపురుపల్లిలో ముదిరిపాకానపడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య సీట్ల సిగపట్లుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
బొబ్బిలిలో...
ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు, ఆయనకు స్వయాన తమ్ముడు ఆర్.వి.ఎస్.కె.రంగరావుల మధ్య బొబ్బిలి టికెట్టు కోసం అంతర్గత పోరు నడుస్తోంది. ప్రస్తుతం సుజయ్‌కృష్ణ రంగారావు రాష్త్ర గనుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండగా నియోజకవర్గంలో ఆర్.వి.ఎస్.కె.రంగరావు తన అనుచరులతో ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచి పదవి కోసం టీడీపీలో చేరిన సుజయ్‌పై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దానినితనకు అనుకూలంగా మార్చుకుని టిక్కెట్టు పొందాలనే ఎత్తుగడలో రంగారావు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
సాలూరులో..
సాలూరులో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్.పి. భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు. ఇటీవలే భంజ్‌దేవ్‌ను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా, సంధ్యారాణి తనదైన శైలిలో భంజ్‌దేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ తన వ్యతిరేఖతను బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. అయితే, ఇదే టిక్కెట్టు ఆశించి ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమాలు, పండుగలు, జాతర్లకు భారీగా ఖర్చుపెట్టిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి కూడా తన ఆశలను పూర్తిగా వదులుకోలేదు. చినబాబు లోకేష్ ద్వారా తన ప్రయత్నాలు మానలేదు.
గజపతినగరంలో..
గజపతినగరం నియోజకవర్గ ప్రజల్లోనే కాకుండా అధికారుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఏ నాయుడికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందని నమ్మకం లేదు. దీంతో అధిస్టానానికి మరికొంత నూరుపోసి ఎలాగైనా అతనికి టిక్కెట్టు రాకుండా చేయాలని టీడీపీ స్వపార్టీ వారే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ రాష్త్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ, బొండపల్లి వైస్ ఎంపీపీ బొడ్డు రాములు టిక్కెట్టుపై ఆశపడుతున్నారు.
పార్వతీపురంలో...
పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్టుకు నలుగురు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో పాటు స్థానిక టీడీపీ యువ నాయకుడు సురగాల ఉమామహేశ్వరరావు టిక్కెట్టును ఆశిస్తున్నా రు. అలాగే, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి కూడా టీడీపీ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, బోనిల సరిత కుమారి రెవెన్యూ శాఖలో ఏఎస్‌వోగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసి టిక్కెట్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి కూడా టిక్కె ట్టు రేసులో ఉన్నారు. దీంతో వీరి మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది.
చీపురుపల్లిలో...
ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి 2019 ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దంటూ స్వపార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులు నేరుగా అమరావతికి వెళ్లి చంద్రబాబునాయుడు చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నారు. వారానికి ఒకసారి అమరావతి వెళ్లి మృణాళినికు సీటు ఇవ్వొద్దని, ఇస్తే ఆమె ఓటమి చెందడం ఖాయమని ఇప్పటికే పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆర్‌ఈసీఎస్‌లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేను టార్గెట్ చేసి బహిరంగ ఆరోపణలకు దిగారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగంకృష్ణ, మరి కొంతమంది టిక్కెట్టు ఆశిస్తున్నారు.
విజయనగరంలో...
విజయనగరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత, ఎంపీ అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఒక కేబుల్ నెటవర్క్ అధినేత టిక్కెట్టును ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకపోతే అశోక్ లేదా ఆయన కుమార్తె బరిలోకి దిగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఎమ్మెల్యేకు టిక్కెట్టు రాకుండా జరిగే ప్రయత్నాలో కొం దరు ఆశావహులు తలమునకలై ఉన్నారు.
ఎస్.కోటలో..
జిల్లా మొత్తం మీద ఎస్.కోట నియోజకవర్గంలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి తప్ప పార్టీలో మరెవరూ టిక్కెట్టు ఆశించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. తేనెపలుకులతో జనాన్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటున్న టీడీపీ నేతలంటేనే ఇక్కడి ఓటర్లకు వెగటు పుట్టింది. దీంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరమని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
నెల్లిమర్లలో...
టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడికి వయసుపై బడిన కారణంగా టిక్కెట్టు ఇవ్వకపోతే తమలో ఎవరికైనా టిక్కెట్టు ఇవ్వాలని నారాయణస్వామినా యుడి కుమారులు పతివాడ తమ్మునాయు డు, రామునాయుడు, అప్పలనాయుడు అధిష్టానానికి ఇప్పటికే విన్నవించారు. అయి తే, వారితో పాటు భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, నెల్లిమర్ల ఎంపీపీ సువ్వాడ వనజాక్షి తమ్ముడు, ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్‌కుమార్‌లు సీటు ఆశిస్తున్నారు.
కురుపాంలో..
కురుపాం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ నర్సింహప్రియ థాట్రాజ్‌లు టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. వీరంతా బంధువులు కావడం విశేషం. అయినప్పటికీ టిక్కెట్టు కో సం ఎవరి ప్రయత్నాలు వారు చాపకింద నీరు లా సాగిస్తున్నట్టు కార్యకర్తలు చెబుతున్నారు.