ప్చ్‌.. నిరాశే!

Search Oparation Team Back To Home No Hopes To Parents In East Godavari - Sakshi

ఫలించని సెర్చ్‌ ఆపరేషన్‌

ఇంటిముఖం పడుతున్న దళాలు

ఏడో రోజూ దొరకని ముగ్గురి జాడ

కొనసాగిస్తామంటున్న కలెక్టర్‌         కార్తికేయ మిశ్రా

తూర్పు గోదావరి,  యానాం: గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతున్నా విపత్తు దళాలు సముద్రం, నదీముఖ ద్వారాలలో మృతదేహాల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్ధితుల్లోనైనా వారి జాడ కనుగొనాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఐ.పోలవరం మండల పరిధిలోని పశువుల్లంక వృద్ధ గౌతమీనదిలో ఈనెల 14న జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో మిగిలిన ముగ్గురు బాలికల ఆచూకీ కోసం శుక్రవారం జరిపిన భారీ సంయుక్త ఆపరేషన్‌ ఫలితానివ్వలేదు. సుమారు వివిధ విపత్తు దళాలైన ఎన్డీఆర్‌ఎఫ్, ఏపీఎస్‌పీఎఫ్, ఎస్‌డీఎఫ్, స్థానిక మత్స్యకారులతో కూడిన 25 బృందాలతో పాటు భైరవపాలెం నుంచి మరో ఆరు బృందాలు సముద్రముఖద్వారంలో సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించాయి.  ఉదయం 6.30 నుంచే యానాం రాజీవ్‌బీచ్‌లో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్‌ నుంచి సంయుక్త ఆపరేషన్‌ ప్రారంభించారు. భైరవపాలెం, సావిత్రినగర్, మగసానితిప్ప, గోగుళ్లంక, గుత్తెనదీవి, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ ఆపరేషన్‌లో ఒక వైపు డ్రోన్‌లు ఉపయోగించడంతో పాటు మరో వైపు నావికాదళాలకు సంబం«ధించి డైవర్స్, మరోపక్క యానాంకు చెందిన మత్స్యకారుల బోట్లతో ఈ భారీ సర్చ్‌ ఆపరేషన్‌ సాయంత్రం వరకు కొనసాగించారు. అయినప్పటికీ ఒక్కరి జాడ కూడా గుర్తించకపోవడంతో విపత్తు దళాలు నిరాశతో వెనుదిరిగాయి.

మరోవైపు గల్లంతైన పోలిశెట్టి అనూష, పోలిశెట్టి సుచిత్ర, కొండేపూడి రమ్యల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే రాజీవ్‌బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఒక్కోదళం టెంట్లను తొలగిస్తుండంతో కొన్ని దళాలు ఇంటిముఖం పడుతున్నాయి. గత  ఆరురోజులుగా ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన టెంట్‌ను శుక్రవారం సాయంత్రం తొలగించడంతో ఇంకా సర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

గాలింపు చర్యలను పర్యవేక్షించిన కలెక్టర్‌
ఒకేసారి 27 బృందాలతో సముద్ర, నదీముఖద్వారాల్లోని ప్రాంతాల్లో చేపట్టిన గాలింపు చర్యలను శుక్రవారం కలెక్టర్‌ కార్తికేయమిశ్రా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్‌బీచ్‌ వద్ద ఏర్పాటు చేసిన బేస్‌క్యాంప్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతుందని, లభ్యమవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ బి.వెంకటరమణ, రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్, అమలాపురం సబ్‌డివిజనల్‌ పోలీస్‌అధికారి ప్రసన్నకుమార్, ఎస్‌డీఎఫ్‌ డీఎస్పీ ఎస్‌ దేవానందరావు, ఎన్డీఆర్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ అంకితకుమార్, పుష్కరరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top