శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి
గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కారు వినతి
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలోజోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్‌కు వివరించానని తెలిపారు. తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలంలో ఇప్పటికే నీటిమట్టం 856 అడుగులకు పడిపోయిందని.. కనీస నీటిమట్టం 854 అడుగులకు తగ్గితే రాయలసీమకు నీళ్లివ్వడం సాధ్యం కాదని వివరించానని చెప్పారు. గవర్నర్ స్పందన ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘వాస్తవాలను గవర్నర్‌కు వివరించాను. 69, 107 జీవోలను గవర్నర్ కూడా అధ్యయనం చేశారు’’ అని చెప్పారు.
ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు
శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం గల రెండు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేపట్టారు.