ముంచెత్తుతున్న చెత్త

Sanitation workers Strike In Visakhapatnam - Sakshi

రెండోరోజుకు కార్మికుల సమ్మె

పేరుకున్న 800 మెట్రిక్‌ టన్నుల చెత్త

నగరంలో కొరవడిన పారిశుద్ధ్యం

విశాఖ సిటీ: జీవో నంబరు 279ని రద్దు చేయాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. దీంతో గ్రేటర్‌ విశాఖలో రహదారులపై చెత్త పేరుకుపోతోంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైనా, వీధుల్లో పారబోస్తున్నారు. ఉన్న శాశ్వత ఉద్యోగులతో కేవలం రోజుకు 700 నుంచి 750 టన్నుల చెత్తను మాత్రమే డంపింగ్‌ యార్డులకు తరలించగలుగుతున్నారు. అంటే రోజుకు దాదాపు 400 టన్నుల చొప్పున రెండు రోజులకు సుమారు 800 టన్నుల చెత్త నగరంలో పేరుకుపోయింది. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రతి రోడ్డు ఓ డంపింగ్‌ యార్డులా మారే ప్రమాదం కనిపిస్తోంది.

700 మెట్రిక్‌ టన్నులు తరలిస్తున్నా..
జీవీఎంసీ పరిధిలో ఉన్న 5,236 ఒప్పంద, కాంట్రాక్ట్‌ కార్మికులు, 1200 మంది రెగ్యులర్‌ ఉద్యోగులంతా కలిసి నగరంలో ఒక రోజుకు ఉత్పన్నమవుతున్న 1100 టన్నుల చెత్తను తరలించగలుగుతున్నారు. వీరిలో 4వేల మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో 1200 మంది రెగ్యులర్‌ ఎంప్లాయీస్‌తో పాటు సమ్మెలో పాల్గొనని 500 మంది ఒప్పంద కార్మికులతో అదనపు పని చేయిస్తూ జీవీఎంసీ అధికారులు సుమారు 700 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. అయినప్పటికీ 400 టన్నులు మిగిలిపోతూనే ఉంది.

విషతుల్యమయ్యే ప్రమాదం
రోడ్లపై పేరుకున్న చెత్తలో కూరగాయల వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోని చెత్త బుట్టలో ఈ తరహా వ్యర్థాలు నాలుగు రోజులు నిల్వ ఉంచితే కుళ్లి, పురుగులు పట్టే ప్రమాదముంది. రెండు రోజులుగా రోడ్లపై ఉన్న వ్యర్థాలు విషతుల్యమయ్యే అవకాశాలున్నాయి. ప్లాస్టిక్‌తో పాటు కుళ్లిన వ్యర్థాలు, కోడిగుడ్ల తొక్కలువంటివి ఉండటం వల్ల విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది. చికెన్‌ వ్యర్థాలు కుళ్లిపోతే 12 శాతం, చేపల నుంచి 8 శాతం, కుళ్లిన కోడిగుడ్ల నుంచి 4 శాతం ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశాలున్నాయి. డయాగ్జీన్లు, ప్యూరాన్ల వంటి విష రసాయనాలు విడుదలయ్యే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

అదనపు సిబ్బందిని నియమించినా..
కార్మికుల సమ్మె నేపథ్యంలో చెత్తను తరలించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రైవేటు సిబ్బందిని నియమించారు. 8 జోన్లకు సుమారు 500 మందిని నియమించారు. వీరు విధుల్లోకి వచ్చిన వెంటనే కార్మిక సంఘాలు అడ్డుకోవడంతో  సీఎంహెచ్‌వో డా.హేమంత్‌కుమార్, ఆయా జోనల్‌ కమిషనర్లు పోలీసుల సహాయంతో చెత్తను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరమైతే మరింత మందిని ఏర్పాటు చేస్తామని సీఎంహెచ్‌వో తెలిపారు.

చెత్త తరలింపు వాహనం అడ్డగింత
ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు 42వ వార్డులో చెత్త తరలింపు వాహనాన్ని అడ్డుకున్నారు.   వార్డు ప్రధాన రహదారిలో చెత్త తరలించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు జీవీఎంసీ ఏడీసీ ఫైనాన్స్‌ విజయ్‌ మనోహర్, 6వ జోన్‌ కమిషనర్‌ రమణమూర్తి, ఏఎంహెచ్‌ఓ మురళీమోహన్‌లను, వాహనాల్ని కార్మికులు అడ్డుకున్నారు. శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు అధికారులు సహకరించాలని కోరారు. చెత్తను  తరలించరాదని ఆందోళన చేశారు. ఆందోళనకారులు ఎంతకీ అడ్డు తొలగకపోవడంతో అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వారితో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top