కడప కేంద్ర కారాగారంలో రోజుకో సంఘటన వెలుగుచూస్తోంది.. ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పించినా సెల్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్ర కారాగారంలో రోజుకో సంఘటన వెలుగుచూస్తోంది.. ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పించినా సెల్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. తీవ్రవాదులుగా అభియోగం మోపబడి శిక్షను అనుభవిస్తున్న వారి వద్దనే సెల్‌ఫోన్లు లభ్యమవుతున్నాయంటే కొందరు అధికారుల, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఏ మేరకుఉందో తెలుస్తోంది. కేంద్ర కారాగారం బయట, లోపల అధికారుల పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్నప్పటికీ ఖైదీలకు సెల్ ఫోన్లు ఎలా అందుతున్నాయో ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో కిలోల కొద్ది గంజాయి బయట నుంచి విసిరేస్తే వార్డన్లు పట్టుకున్నారు. ఆ గంజాయి ఎలా వచ్చిందనేది ఇప్పటి వరకు నిగ్గుతేల్చలేని పరిస్థితి నెలకొంది.
కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా పని చేసిన ఆకుల నరసింహ ఖైదీలను ఆశ్రమ వాసులుగా పిలుస్తూ గౌరవ ప్రదంగా చూస్తూ వారిలోసత్ప్రవర్తనకు కృషి చే శారు. కేంద్ర కారాగారం లోపల, బయట కూరగాయలు, ఆకుకూరల తోటలను పెంచారు. కొందరు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని సెల్‌ఫోన్లను వాడుతూ ఆ తోటలలో భద్రపరుచుకునే వారు. తర్వాత కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌గా వచ్చిన డాక్టర్ ఇండ్ల శ్రీనివాసరావు హయాంలో సెల్‌ఫోన్లు విపరీతంగా వాడుతున్నారనే సమాచారం బయటికి పొక్కింది. ఆ సమయంలో పతాక శీర్షికన సెల్‌ఫోన్ల వ్యవహారంపై, గంజాయి విసరడంపై కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత కేంద్ర కారాగార సూపరింటెండెంట్ గోవిందరాజులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సీసీ కెమెరాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సెల్‌ఫోన్ల ద్వారాగానీ, ల్యాండ్‌లైన్ ద్వారాగానీ ఖైదీలు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో మరలా సెల్‌ఫోన్లు లభ్యం కావడం అనేది చర్చనీయాంశమైంది.
ఐఎస్‌ఐ తీవ్రవాదుల వద్ద సెల్‌ఫోన్లు లభ్యం
కడప కేంద్ర కారాగారం నుంచి వరంగల్ కేంద్ర కారాగారానికి ఈనెల 29వ తేదీన భారీ బందోబస్తు మధ్య ఐదుగురు ఐఎస్‌ఐ తీవ్రవాదులను తరలించారు. వీరిలో జహీర్, సలీం, విశ్వాస్, రియాజ్, రియాద్ ఉన్నారు. వీరిని కడపకేంద్ర కారాగారం వద్ద తనిఖీ చేసి పంపించారు. అయినప్పటికీ వరంగల్ కేంద్ర కారాగారానికి చేరుకునే సమయానికి ఐదుగురి వద్ద ఐదు సెల్‌ఫోన్లు లభ్యం కావడం గమనార్హం.
కట్టుదిట్టమైన చర్యలకు ప్రయత్నిస్తున్నాం
కడప కేంద్ర కారాగారంలో ఫోన్ సౌకర్యాన్ని ఖైదీలకు కల్పించడం వల్ల సెల్‌ఫోన్లు లభ్యమయ్యే వ్యవహారాన్ని తగ్గించగలిగాం. ఐఎస్‌ఐ తీవ్రవాదులను వరంగల్‌కు తరలించగా అక్కడి తనిఖీలలో సెల్‌ఫోన్లు లభించాయని సమాచారం వచ్చింది. సెల్‌ఫోన్ల నిరోధానికి తమవంతు బాధ్యతగా కృషి చేస్తున్నాం. సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం.
- గోవిందరాజులు, కేంద్ర కారాగార సూపరింటెండెంట్