
అతడే ఒక సైన్యం
దీక్ష.. నిరసన.. ఆందోళన.. పేరు ఏదైనా ఆయనది ఉద్యమపథమే. తన జాతి కోసం.. జాతికిచ్చిన హామీల అమలు కోసం ఆయన అహర్నిశలు పోరాడుతూనే ఉన్నారు.
♦ పద్మనాభం.. ఉద్యమ నినాదం
♦ కాపు జాతి రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం
♦ హామీలు అమలు చేయాలని రెండేళ్లుగా సర్కారుపై పోరుబాట
కిర్లంపూడి (జగ్గంపేట) : దీక్ష.. నిరసన.. ఆందోళన.. పేరు ఏదైనా ఆయనది ఉద్యమపథమే. తన జాతి కోసం.. జాతికిచ్చిన హామీల అమలు కోసం ఆయన అహర్నిశలు పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా కాపులకు హామీలిచ్చి.. ఆ తర్వాత వాటిపై నోరుమెదపని చంద్రబాబును నిద్రలేపేందుకు నిత్యం ఉద్యమిస్తూనే ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసినా.. కేసులతో బెదిరించినా.. కుటుంబసభ్యులను ఇబ్బందిపెట్టినా ఉద్యమమే ఊపిరిగా సాగిపోతున్నారు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపుల కోసం ఉద్యమం చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో ఆయన కాపు జాతి కోసం పోరాడుతున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
‘‘మా పార్టీ అధికారంలోకి వస్తే ఆరునెలల్లోపు కాపులను బీసీల్లోకి చేరుస్తాం..ఏటా రూ.వెయ్యికోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతాం.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం.’’ : ఇవీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆరునెలలు గడిచాయి. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలపై నోరుమెదప లేదు. ఏడాదైంది.. అయినా కాపులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
పట్టించుకోలేఖనే..
జూలై 26 2015 : కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించలేదు.
ఆగస్టు 25, 2015 : ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఆ తర్వాత మరో 2,3 లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
నవంబర్ 2015 : తుని ఐక్య గర్జనకు ముద్రగడ పిలుపునిచ్చారు. జనవరి 31న తేదీని ఖరారు చేశారు.
జనవరి 31, 2016 : ముద్రగడ పిలుపుతో తునిలో ఏర్పాటు చేసిన కాపు ఐక్యగర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కాపులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ సమయంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడంతో రైలు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ముద్రగడతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఫిబ్రవరి 4 2016 : ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు.
ఫిబ్రవరి 8 2016 : టీడీపీ పెద్దలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లోపు మంజునాథ కమిషన్ రిపోర్టు తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడానికి కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చి ముద్రగడ దీక్షను విరమింపజేశారు.
జూన్ 8, 2016 : తుని రైలు ప్రమాద ఘటనలో అమలాపురంలో కాపు యువకులను విచారణకు పిలవగా విషయం తెలుసుకున్న ముద్రగడ అమలాపురం వెళ్లగా పోలీసులు ఆయనను వాహనంలో ఎక్కించుకుని కిర్లంపూడిలో దించారు.
జూన్ 11, 2016 : జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసుదాసుతోపాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరం సబ్‌జైలుకు తరలించారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అదేరోజు పోలీసులు ముద్రగడ, ఆయన సతీమణి, కుమారుడు, కోడలు ఇలా పలువురిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జేఏసీ నాయకులను విడుదల చేసే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ బీష్మించారు. ఎట్టకేలకు జేఏసీ నాయకులు విడుదల కావడంతో 14 రోజుల తరువాత ముద్రగడ ఆసుపత్రి నుంచి కిర్లంపూడికి చేరుకుని ఇంటి వద్ద దీక్ష విరమించారు.
నవంబర్ 9, 2016 : రాజమహేంద్రవరంలో రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేశారు. అదే సమయంలో కిర్లంపూడి నుంచి రావులపాలెం మీదుగా అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించతలపెట్టారు. అయితే పాదయాత్ర ప్రారంభించకుండానే కిర్లంపూడిలో వేలమంది పోలీసులను మోహరింపజేసి ముద్రగడను గృహనిర్బంధంచేశారు. దీంతో ముద్రగడ పాదయాత్రను వాయిదా వేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాదయాత్ర చేసి తీరుతానని త్వరలో తేదీని ప్రకటిస్తానని ముద్రగడ పద్మనాభం సమావేశంలో ప్రకటించారు.
జనవరి 25, 2017 : కిర్లంపూడి నుంచి రావులపాలెం వరకు అంతర్వేది వరకు పాదయాత్ర ప్రకటించారు. అయితే నాలుగు రోజుల ముందుగానే పోలీసు బలగాలు కిర్లంపూడికి చేరుకుని పాదయాత్రకు బయలుదేరుతున్న ముద్రగడను గృహనిర్బంధం చేశారు. అనంతరం కాకినాడలో మహిళా జేఏసీ, లాయర్ల జేఏసీ సమావేశాలతోపాటు పలు దఫాలుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు.
మే 25 : చావో రేవో చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జూలై 26న నిర్వహించ తలపెడుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు.
అప్పటి నుంచి ముద్రగడకు సంఘీభావంగా కాపునాయకులు కిర్లంపూడి రావడం ప్రారంభించారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కాపు నేతలు ఆయనను కలిశారు. ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూలై నెల సమీపించడం... చావో రేవో చలో అమరావతి పాదయాద్ర తేదీ దగ్గరపడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కాపు నాయకులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. కొంతమందిని బైండోవర్ చేశారు. సెక్షన్ 30 అమలు చేశారు. మరోవైపు హోం మంత్రి చినరాజప్ప కూడా ముద్రగడ ఉద్యమంపై తీవ్రంగానే స్పందించారు. అలాగే డీజీపీ సాంబశివరావు కూడా ముద్రగడపద్మనాభం చేపట్టబోయే పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదన్నారు. దీనిపైనా ముద్రగడ తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తీసుకునే పాదయాత్రలు చేపట్టారా? నేనెందుకు తీసుకోవాలంటూ మండిపడ్డారు.
కిర్లంపూడిలో భారీ పోలీసు బలగాలు..
జూలై 26 సమీపిస్తుండడంతో కిర్లంపూడికి పోలీసు బలగాలు భారీగా చేరాయి. జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో గతంలో లాగే ముద్రగడను గృహనిర్బంధం చేస్తారా?, పాదయాత్రను చేయనిస్తారా? అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.