నేను లోకల్‌..

Sakshi Interview With Grandhi Srinivas

సాక్షి, భీమవరం : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం, వారికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండటమే నాకు తెలిసింది. ఎక్కడి నుంచో దిగుమతి అయిన నాయకులు గెలిస్తే ఎలా ఉంటుందో గడిచిన పది సంవత్సరాలుగా భీమవరం ప్రజలు అనుభవిస్తున్నారు. మరోసారి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే స్థానికుడిని గెలిపించాలని భీమవరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రెండో బార్డోలిగా పేరొందిన భీమవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఓటర్లలో ఉత్కంఠతను రేపుతున్నాయి. ప్రధానంగా ప్రజాసమస్యలపై పోరాటమే శ్వాసగా భావించే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సినీనటుడు, జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ తన మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. 

ప్రశ్న: నియోజకవర్గంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి?
గ్రంధి: భీమవరం పట్టణంలో డంపింగ్‌ యార్డు సమస్య, యనమదుర్రు డ్రెయిన్‌ ప్రక్షాళన, యనుమదుర్రు డ్రెయిన్‌పై అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన, అప్రోచ్‌రోడ్లు, బైపాస్‌ రోడ్డును విస్సాకోడేరు శివారు వరకు అభివృద్ధి చేయడం వంటివి ప్రధానమైన అజెండా. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. పట్టణంలో రైల్వే ఫ్‌లైఓవర్స్‌ నిర్మాణం, పట్టణ శివారు ప్రాంతాల్లో కొత్తరోడ్లు ఏర్పాటు, వీరవాసరం, భీమవరం మండలాల్లో మంచినీరు, మురుగునీరు సమస్య, పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మాణం వంటివాటిని ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను.

ప్రశ్న: మీరు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏమిటి?
గ్రంధి: భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళా ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువ చేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చాను. పట్టణ మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమిని సేకరించి దానిలో 60 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఏర్పాటు చేయించాను. పేదలకు సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమిని సేకరించాను. 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చాను. యనమదుర్రు డ్రెయిన్‌పై ఆరు బ్రిడ్జిల నిర్మాణం, బైపాస్‌రోడ్డుకు శ్రీకారం చుట్టాను. ఓల్డ్‌ యనమదుర్రు డ్రెయిన్‌ అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేశాను. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్ల జోన్‌ ఏర్పాటు చేయించాను. పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం వద్ద గల సోమగుండం చెరువు అభివృద్ధికి కృషి చేశాను. 

ప్రశ్న: ఎన్నికల బరిలో మీ బలం ఏమిటి?
గ్రంధి: ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాను. ఏ సమయంలోనైనా నా వద్దకు రావచ్చు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటమే నా బలం. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఉంది. అందుకే మరోసారి రాజన్న రాజ్యం సాకారం చేయాలనే ఎన్నికల బరిలో నిలిచాను. 

ప్రశ్న: రాజకీయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
గ్రంధి: మా నాన్న గ్రంధి వెంకటేశ్వరరావే నాకు రాజకీయంగా స్ఫూర్తి. అలాగే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ప్రధానమంత్రులు అటల్‌ బిహారీ వాజ్‌పేయ్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సూపర్‌స్టార్‌ కృష్ణ నా అభిమాన నాయకులు.

ప్రశ్న: రాజకీయ ప్రవేశం ఎప్పుడు?
గ్రంధి: విద్యార్థిదశలో ఉండగానే దాదాపు 1977 ప్రాంతంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నా. ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతాపార్టీలో చురుకుగా పనిచేశా.

ప్రశ్న: చేపట్టి రాజకీయపదవులు?
గ్రంధి: మొట్టమొదటిసారిగా భీమవరం పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగా పదవిని చేపట్టి వెనువెంటనే జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష పదవి వరించింది. 

ప్రశ్న: ప్రజాక్షేత్రంలో ఎప్పుడు పోటీలో పాల్గొన్నారు?
గ్రంధి: 1995లో భీమవరం అర్బన్‌బ్యాంక్‌ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించా. అనంతరం 2004లో భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించా.

ప్రశ్న: ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
గ్రంధి: నా తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగా. కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమేగాక ఎంతో అండదండగా ఉంటున్నారు.

ప్రశ్న: రాజకీయాల్లో మీ లక్ష్యం?
గ్రంధి: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించడమే లక్ష్యం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top