వెరిఫికేషన్‌కు హాజరుకాలేని వారికి రెండో చాన్స్‌

Sachivalayam Posts, Second Chance For Verification - Sakshi

పలు జిల్లాల్లో ‘సచివాలయ’ షార్ట్‌ లిస్టులు విడుదల

మరికొన్ని జిల్లాల్లో శరవేగంగా సాగుతున్న ప్రక్రియ

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కాల్‌ లెటర్‌లో పేర్కొన్న తేదీల్లో వివిధ కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయినా, హాజరైనా అన్ని ఒరిజనల్స్‌ చూపలేకపోయినా.. వారికి రెండో ఛాన్స్‌ ఇవ్వాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జిల్లా సెలక్షన్‌ కమిటీలను ఆదేశించారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్‌ కమిటీలు షార్ట్‌ లిస్టు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. శనివారం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో షార్టు లిస్టులు విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ పద్ధతిలో సమాచారం పంపే కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలిపారు.

షార్ట్‌ లిస్టులో పేరున్న వారు వారి కాల్‌ లెటర్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు çహాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కాగా, షార్ట్‌ లిస్టుల తయారీ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై శనివారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ జిల్లా సెలక్షన్‌ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ
ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న విధుల్లో చేరిన అనంతరం.. అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ ఇస్తారు. ఇందు కోసం ఈ నెల 26వ తేదీ నుంచి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

33 శాతం ఉద్యోగాలు మహిళలకు..
సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 33 శాతం పోస్టులు మహిళలకు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ప్రతిభ మేరకు మహిళలకు అన్ని కేటగిరీల్లోనూ నిర్ణీత సంఖ్యలో మహిళలకు పోస్టులు రాని పరిస్థితుల్లో వారికి ప్రత్యేకంగా మూడో వంతు పోస్టులు వచ్చేలా అవకాశం కల్పిస్తారు.

సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు
ఉద్యోగాలకు ఎంపికైన వారికి అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్లు వెంటనే జారీ చేసేలా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బీసీ అభ్యర్థులు తాజాగా క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని, వాటితో పాటు అవసరమైన వారికి నివాసిత, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించింది.

వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు అధికారులకు చూపాల్సిన సర్టిఫికెట్ల వివరాలు..

  • అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం.
  • ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
  • ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
  • నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఎక్కడ చదివారన్న వివరాలతో స్టడీ సర్టిఫికెట్లు.
  • స్కూలు, కాలేజీల్లో చదవకుండా డైరెక్ట్‌ డిగ్రీ వంటి కోర్సులు చేసిన వారి నివాస ధ్రువీకరణ పత్రం.
  • రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి స్థానికత మార్చుకున్నప్పుడు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌.
  • చెవిటి, మూగ వైకల్యంతో ప్రత్యేక స్కూళ్లలో చదువుకున్న వారు.. వారి తల్లిదండ్రుల నివాసిత ధ్రువీకరణ పత్రం.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం.
  • బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌.
  • దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్‌ సర్టిఫికెట్‌.
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, క్రీడల కోటా అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్లు.
  • ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొంది.. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారు తమ శాఖాధిపతి నుంచి పొందిన ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌.
  • తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top