
సర్కారుకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం
సాక్షి, అమరావతి: సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు గ్రామ/వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్‌ను కలిసి నోటీసు అందజేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఎండీ జానీపాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్, కో ఛైర్మన్లు బత్తుల అంకమ్మరావు, యువషణ్ముఖ్, కె ప్రభాకర్, వైస్ ఛైర్మన్లు డీ మధులత, ఎస్ మహాలక్ష్మి, జీవీ శ్రీనివాస్, ఎస్‌కే మహబూబ్ బాషా, జాన్ క్రిస్టోఫర్‌తో దాదాపు రెండు గంటలపాటు చర్చించారు.
సర్వేలతో విసిగివేసారాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో పనిచేసేందుకు 1.25లక్షల మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కంకణబద్ధులై ఉన్నారని, అయితే ఇటీవల ప్రభుత్వం చెబుతున్న వరుస సర్వే పనులతో విసిగివేసారామని ఉద్యోగసంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్ల విధులు తమకు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు. సెలవులు, పండగలు, ఆదివారాల్లోనూ బలవంతంగా పనిచేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సమయపాలన లేకుండా నిర్వహిస్తున్న వీడియోకాన్ఫరెన్సుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, ఆరేళ్లు ఒకే క్యాడర్‌లో పనిచేసిన వారికి సర్పిసు నిబంధనలు వర్తింపజేయాలని విన్నవించారు. గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌కు మార్చాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని నోటీసుల్లో కోరారు.
వచ్చే 1 నుంచి సర్వేయర్ల ఉద్యమబాట
ఇదిలా ఉంటే సమస్యలపై వచ్చేనెల 1 నుంచి ఉద్యమబాట పట్టనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ సర్వేయర్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు, కార్యదర్శి బి.జగదీష్ తెలిపారు. విజయవాడలో సోమవారం జరిగిన జేఏసీ నేతల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆరేళ్లుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు అంశాలు, ఆర్థిక అంశాలపై స్పష్టత లేదన్నారు. వలంటీర్ల మాదిరిగా సచివాలయ ఉద్యోగులతో డోర్ టు డోర్ సర్వేలు, ఇతర సర్వేలు చేయిస్తూ మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు.
అలాగే, ఇప్పటివరకూ ఎవరికీ ప్రమోషన్ ఛానల్ లేదని, బేసిక్ పే అందరికీ ఒకటే పేస్కేల్‌గా ఇవ్వాలని, సీనియారిటీ జాబితా విడుదల చేయడంలేదని, నోషనల్ ఇంక్రిమెంట్ల ఊసేలేదని తెలిపారు. తమకు ఎటువంటి ఉద్యోగ భద్రతగానీ, సౌకర్యాలుగానీ లేవన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వ పెద్దలు ఈ నెలాఖరులోపు తమకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అక్టోబరు ఒకటి నుంచి వలంటీర్ విధులు, పింఛన్ల పంపిణీ, సర్వేలు చేయడం వంటి పనులన్నింటినీ నిలుపుదల చేస్తామని వారు హెచ్చరించారు. అవసరమైతే సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరవధిక దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.