ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,350.47 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర కన్వర్జెన్స్
విశాఖపట్నం: ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,350.47 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర కన్వర్జెన్స్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన డ్వామా, 11 లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో జరిగిన ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేదలకు ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి అనేది ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి హామీ పనుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, యంత్రాల వినియోగం నిషేధమని స్పష్టం చేశారు. ఇందు కోసం తమకు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామన్నారు. వ్యవసాయ, పట్టు పరిశ్రమ, పంచాయతీరాజ్, మత్స్యపరిశ్రమ, పశుసంవర్థక, అటవీ, ఉద్యానవన, సర్వశిక్షాభియాన్, స్వచ్ఛభారత్ మిషన్ తదితర 11 శాఖల పనులను సమన్వయంతో ఉపాధి హామీ కింద నిర్వహించేందుకు అవకాశం కల్పించామన్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 90 శాతం ఉపాధి హామీ నిధులను వినియోగించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఉద్యానవన రైతులు వర్మీ కంపోస్టు యూనిట్‌తో పాటు పంట కుంటల నిర్మాణం కూడా తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. ఏజెన్సీలో భూమి చదును కోసం గిరిజనులకు 150 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు చేసిన నిధులను వచ్చేనెల 31 లోపు ఖర్చు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉపాధి క ల్పన, వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనుల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనే యులు మాట్లాడుతూ ప్లాంటేషన్ కోసం ఉద్యానవన శాఖ అధికారులు నర్సరీలు నిర్వహించి, రెండేళ్ల వయస్సు గల మొక్కలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. రూ.300 కోట్ల ఉపాధి హామీ నిధులను మత్స్యశాఖకు కేటాయించామని, వీటితో మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 2018 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మార్చడం కోసం అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, అదనపు జాయింట్ కమిషనర్ చక్రవర్తి, జలసిరి ప్రాజెక్టు మేనేజర్ వరప్రసాద్, నాలుగు జిల్లాల డ్వామా పథక సంచాలకులు, వ్యవసాయ, పట్టు పరిశ్రమ, పంచాయతీరాజ్, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, అటవీ, ఉద్యానవన, సర్వశిక్షాభియాన్, స్వచ్ఛభారత్ మిషన్ తదితర 11 శాఖల అధికారులు పాల్గొన్నారు.