పంటి వైద్యం ఇంటలేదా?!

Rs 3 Lakh For Yanamala's Tooth Treatment? - Sakshi

‘రూట్‌ కెనాల్‌’ కోసం సింగపూర్‌ వెళ్లిన ఆర్థిక మంత్రి యనమల

వైద్యానికి అయిన ఖర్చు రూ.2.88 లక్షలు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రభుత్వ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటి చికిత్సకు దిక్కులేదా? అసలు రాష్ట్రంలో పంటి వైద్య నిపుణులే లేరా? మరి ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు.. మరో 30 లక్షల మంది వైద్యం ఎక్కడ చేయించుకుంటున్నారు? ఇవన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత వైద్యం(రూట్‌కెనాల్‌) కోసం సింగపూర్‌ వెళ్లి రూ.2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము వెచ్చించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తదితరులకు వైద్యపరంగా ఎంత ఖర్చయితే అంత ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధనలున్నా.. రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కు రూ.2.88 లక్షలా! అంటూ సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు.

బుధవారం యనమల దంతవైద్యానికి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తూ సర్కార్‌ ఇచ్చిన ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయినా ఉద్యోగులకు గానీ, పెన్షనర్లకుగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ, 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పేద రోగులకుగానీ.. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే డబ్బు చెల్లించేది లేదంటూ ఏకంగా సర్కారే నిబంధనలు విధించింది. పెద్ద పెద్ద జబ్బులకు రాష్ట్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన డాక్టర్లు లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత డబ్బులు పెట్టుకుని ఇతర నగరాల్లో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.

ఉద్యోగులకు, పెన్షనర్లకు రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కు ఒక్కో సిట్టింగ్‌కు రూ.3,500కు మించి లేదు. మొత్తం రమారమి రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. అలాంటిది ఒక్కసారి సింగపూర్‌లో రూట్‌కెనాల్‌ చేయించుకున్న యనమలకు రూ.2.88 లక్షలు చెల్లించడంపై సామాన్యులు, ఉద్యోగులు, పెన్షనర్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే పన్ను వారికి వెళుతోంది కాబట్టి ఇక్కడే వైద్యం చేయించుకోవాలని చెప్పిన సర్కారు.. మరి మన పన్ను సింగపూర్‌కు వెళ్లదా.. అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకోన్యాయం.. ఉద్యోగులకోన్యాయమా.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దంత వైద్యకళాశాలకు చెందిన ఓ వైద్యుడు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఆస్పత్రిని బట్టి, డాక్టర్‌ను బట్టి ఒక్కో సిట్టింగ్‌కు రూ.2,500 నుంచి రూ.3000 అవుతుందని.. మూడు సిట్టింగ్‌లలో ఈ వైద్యం పూర్తవుతుందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top