వాటాకొస్తే సరి..! | Rs .2.49 crore parked in the center of a watershed plan | Sakshi
Sakshi News home page

వాటాకొస్తే సరి..!

Oct 21 2015 4:02 AM | Updated on Sep 3 2017 11:15 AM

వాటర్‌షెడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా పెంచేంతవరకు నిధులు

వాటర్‌షెడ్ పథకానికి రూ.2.49 కోట్ల నిధులు నిలిపిన కేంద్రం
ఆగిన అభివృద్ధి పనులు
ఇప్పటివరకు కేంద్రం వాటా 90,     రాష్ట్ర  వాటా 10 శాతం
రాష్ట్ర వాటా పెంచాల్సిందేనంటూ కేంద్రం ఆదేశం

 
చిత్తూరు: వాటర్‌షెడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా పెంచేంతవరకు నిధులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రం ఎటూ తేల్చకపోవడంతో గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లాకు ఇవ్వాల్సిన రూ.2.49 కోట్ల నిధులను నిలుపుదల చేసింది. దీంతో జిల్లాలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుం డా పోయింది. జిల్లాలో వాటర్‌షెడ్ పథకం కింద  2009 -10 నుంచి 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితితో పనులు మొదలెట్టారు. 2009-10లో తొమ్మిది మండలాల పరిధి లో 9 ప్రాజెక్టుల కింద 55 వాటర్‌షెడ్ పనులతో38.25 వేల హెక్టార్లలో అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. 2010-11లో 14 మండలాల పరిధిలో 18 ప్రాజెక్టుల కింద 115 వాటర్‌షెడ్ పనుల కింద 77.13 వేల హెక్టార్ల పరిధిలో, 2011-12లో 10 మండలాల పరిధిలో 20 ప్రాజెక్టుల కింద 105 వాటర్‌షెడ్ల పరిధిలో 82.68 వేల హెక్టార్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇక 2012-13లో రెండు మండలాల పరిధిలో 11 ప్రాజెక్టుల కింద 60 వాటర్‌షెడ్ల పరిధిలో 43.83 వేల హెక్టార్లలో, 2014-15లో ఒక్క మండల పరిధిలో నాలుగు ప్రాజెక్టుల కింద 24 వాటర్‌షెడ్ల పరిధిలో 16వేల హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది.

అయితేపై రెండేళ్లకు సంబంధించి పనుల్లో పురోగతి లేకుండా పోయింది. కేంద్రం సైతం మొక్కుబడిగా నిధులు ఇవ్వడంతో వాటర్‌షెడ్ల పనులు జరగడం లేదు. మొత్తంగా ఆరేళ్ల కాలపరిమితిలో 36 మండలాల పరిధిలో 62 ప్రాజెక్టుల కింద 359 వాటర్‌షెడ్ల పరిధిలో 2.54లక్షల హెక్టార్లలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. ఇందుకోసం రూ.305.59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.136 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 ఏడాదికి సంబంధించి పనులు ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. 2012-13కు సంబంధించి కూడా మొక్కుబడి పనులతో సరిపెట్టారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కేంద్రం ఇవ్వాల్సిన 90 శాతం వాటా రూ.2.49 కోట్ల నిధులను నిలిపివేయడంతో పనులు దాదాపు నిలిచిపోయాయి. ఇప్పటివరకు వాటర్‌షెడ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను 20 నుంచి 25 శాతానికి  పెంచాలని  కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటూ తేల్చలేదు. దీంతో కేంద్రం నిధులను నిలుపుదల చేయడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం  నిధుల వాటా విషయం తేల్చితే తప్ప అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి లేదని అధికారులంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement