‘హైవే’ దొంగలు  

Robberies On National Highways - Sakshi

జాతీయ రహదారులపై  వరుస దోపిడీలు 

ఐచర్‌ వాహనాల్లోని  వస్తువులను కొల్లగొడుతున్న వైనం 

‘పార్థి గ్యాంగ్‌’ చేస్తున్నట్టు అనుమానాలు 

 రైలు దోపిడీల్లోనూ ఈ గ్యాంగ్‌కు  విశేషానుభవం

 అప్రమత్తంగా లేకపోతే  అంతే సంగతులు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల–పాణ్యం మధ్యలో ఈ నెల 4వ తేదీ రాత్రి ‘వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌’ వాహనాన్ని దొంగలు కొల్లగొట్టారు. ఇందులో బిగ్‌సీ, లాట్‌ మొబైల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థల వస్తువులు రవాణా అవుతుంటాయి.  కర్నూలు–కడప హైవేపై ఈ నెల 5న అర్ధరాత్రి డీటీడీసీ కొరియర్‌ వాహనంలో దొంగలు దారిదోపిడీకి తెగబడ్డారు. ‘డాట్‌జాట్‌’ అనే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థతో డీటీడీసీకి ఒప్పందం ఉంది. అదృష్టవశాత్తు ఆ రోజు లోడింగ్‌ లేదు. దీంతో కేవలం రూ.2 లక్షల విలువైన వస్తువులు దోపిడీకి గురయ్యాయి. దీనిపై నంద్యాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత నంద్యాల– ఆళ్లగడ్డ మధ్యలో  ‘వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌’ వాహనాన్ని కూడా దోపిడీ చేశారు. ఆళ్లగడ్డ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వరుసగా రెండు రోజులు వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌ వాహనాన్ని కొల్లగొట్టడం గమనార్హం.  ఈ నెల 6న  కర్నూలు– బెంగళూరు హైవేపై ‘ఎక్స్‌ప్రెస్‌ బీస్‌’ అనే కొరియర్‌ వాహనాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వస్తువులను రవాణా చేస్తుంటుంది. అదే రోజు అర్ధరాత్రి తర్వాత నంద్యాల గాం«దీచౌక్‌లోని వెంకటరమణ అనే వ్యాపారి దుకాణంలో 1.4 కిలోల బంగారం, రూ.5లక్షల నగదు దోచేశారు. దీనిపై నంద్యాల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు వరుసగా జరిగిన ఈ దొంగతనాలను పరిశీలిస్తే ఉత్తర భారతదేశానికి చెందిన ‘పార్థిగ్యాంగ్‌’ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైవే దొంగతనాలు, సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ ద్వారా రైలు దోపిడీలు చేయడంలో ‘పార్థిగ్యాంగ్‌’ దిట్ట. వీరు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దిగారంటే వరుసగా నెల రోజుల పాటు కొల్లగొట్టి వెళతారు.

హైవేలో దోపిడీలు ఎలా చేస్తారంటే.. 
కొరియర్‌ సర్వీసులు, బంగారు దుకాణాలకు చెందిన నగలు ఎక్కువగా ఐచర్‌ వాహనాల్లో రవాణా చేస్తుంటారు. సదరు వాహనంపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక్కో దోపిడీకి నాలుగు ముఠాలు పనిచేస్తాయి. రెండు ముఠాలు బైక్‌లను, ఒక ముఠా క్యారేజ్‌ కారు, మరో ముఠా లారీని వినియోగిస్తాయి. ఐచర్‌ ముందు వెళుతుంటే బైక్‌లో ఇద్దరు అనుసరిస్తారు. వాహనం వెనుకభాగంలోని లాక్‌కు దగ్గరగా బైక్‌ వెళుతుంది. బైక్‌ వెనుకభాగంలోని వ్యక్తి కట్టర్‌ ద్వారా లాక్‌ తొలగిస్తాడు. ఆ తర్వాత రన్నింగ్‌లోనే 

బెక్‌ ముందుభాగంలోకి వచ్చి ఐచర్‌లోకి వెళతాడు. ఇలా మరో వ్యక్తిని కూడా ఐచర్‌లోకి పంపిస్తారు. డోర్‌ మూసేసి లోపల ఉన్న బాక్స్‌లను కట్‌ చేస్తారు. సెల్‌ఫోన్‌లు, బంగారం, ఇతరత్రా చిన్నగా ఉన్న విలువైన వస్తువులన్నీ రెండు పెద్ద బ్యాగ్‌లలో సర్దుతారు. ఐచర్‌ వెనుక వీరి ముఠాకు చెందిన లారీనే వస్తుంది. దీని వెనుక బైక్‌లో అనుసరించే మరో ముఠా వెనుక వాహనాలు రాని సమయం చూసి ఫోన్‌లో సమాచారం ఇస్తుంది. అప్పుడు క్యారేజ్‌ కారును ఐచర్‌ వాహనానికి దగ్గరగా రప్పించి.. డోర్లు తెరిచి బ్యాగ్‌లను వెనుక పడేస్తారు. కారును ఒక ప్రదేశంలో ఆపేసి ఆ బ్యాగ్‌లను లారీలోకి మారుస్తారు. ఇలా రోజూ 2– 3 ఐచర్‌ వాహనాలను దోచేస్తారు. దోపిడీ జరిగిన విషయం లారీ డ్రైవర్‌కు ఏమాత్రమూ తెలీదు. 4,5 ,6 తేదీల్లో జిల్లాలో జరిగిన హైవే చోరీలన్నీ ఈ తరహావే కావడం గమనార్హం. డీటీడీసీ నిర్వాహకుడు  నాగేంద్రరెడ్డితో పాటు ఇతర కొరియర్‌ సరీ్వసుల బాధ్యులు, పోలీసులు దోపిడీల తీరు చూసి విస్తుపోయారు. ఈ తరహా దోపిడీలు చేసేది ఉత్తరభారతదేశానికి చెందిన ‘పార్థి గ్యాంగ్‌’ మాత్రమే!  బైక్‌ నడపడం, దానిపై నుంచి మరో వాహనంలోకి వెళ్లడం లాంటి ప్రమాదకర ఫీట్లు వారు మాత్రమే అత్యంత చాకచక్యంగా చేయగలరు.

కొరియర్ల ద్వారా విలువైన సామగ్రి రవాణా.. 
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌ తదితర ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా వస్తువులను బుక్‌చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. మొత్తం వ్యాపారంలో 40శాతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారానే జరుగుతుండడం గమనార్హం. వీటిని వినియోగదారులకు అందజేసే కొరియర్లతో పాటు బిగ్‌సీ, బిగ్‌బీ, లాట్, హ్యాపీ మొబైల్స్‌ లాంటి సంస్థలు తమ వస్తువులను ఐచర్‌ వాహనాల్లో రవాణా చేస్తున్నాయి. ఇది తెలిసే దొంగలు దారి దోపిడీలకు తెగబడుతున్నారు.

పగలు రెక్కీ..రాత్రి దోపిడీ.. 
పార్థి గ్యాంగ్‌ ఒక ప్రాంతాన్ని ఎంచుకుని రంగంలోకి దిగుతుంది. నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో దారిదోపిడీలు, చోరీలకు తెగబడుతుంది. ఆపై తిరిగి సొంతప్రాంతానికి చేరుకుంటుంది. హైవేలో దారి దోపిడీలతో పాటు బంగారు దుకాణాలు, ఇళ్లలోనూ చోరీలకు పాల్పడతారు. ఉదయం దుప్పట్లు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ తాళాలు వేసిన ఇళ్లు, బాగా వ్యాపారం జరిగే, విలువైన వస్తువులు ఉంటాయని భావించే షాపులను గుర్తిస్తారు. ఇళ్ల ముందు తీగలపై ఆరేసిన దుస్తులు చూసి ఇంట్లో ఏ వయసు వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నారనేది పసిగడతారు. ఇంటి చుట్టూ వాసన చూసి కిచెన్‌ ఎక్కడుంది? హాలు, స్టోర్‌ రూం ఎక్కడున్నాయనేది తేల్చేస్తారు. రాత్రికి రంగంలోకి దిగుతారు. సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడతారు. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రీన్‌లైట్‌ లేకుండా సిగ్నల్‌ కట్‌ చేస్తారు. రైలు ఆగిపోతుంది. వెంటనే రైలులోని ‘పార్థిగ్యాంగ్‌’ సభ్యులు కత్తులతో భయపెట్టి నగదు, నగలు దోచుకుని దిగివెళ్లిపోతారు. ఇదంతా 2–4 నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. హైవే దోపిడీలు, బంగారు దుకాణంలో చోరీతో ‘దొంగల ముఠా’లు జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వరుస చోరీలకు తెగబడే ప్రమాదమూ లేకపోలేదు. 

వరుస చోరీలతో భయమేస్తోంది..
రోజూ హైదరాబాద్‌ నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్‌కు మా వాహనాలు వెళుతుంటాయి. విలువైన వస్తువులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌  వస్తువులు రవాణా అవుతుంటాయి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్‌ తీసుకోరు. చోరీ జరిగిన తర్వాత గొడవ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆళ్లగడ్డ–కర్నూలు మధ్యలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. వాహనం గమ్యం చేరేదాకా నిద్రపట్టడం లేదు. 
–నాగేంద్రరెడ్డి, డీటీడీసీ సూపర్‌ ఫ్రాంచైజీ ఇన్‌చార్జ్, కడప 

ఆధారాలు దొరికాయి..త్వరలోనే పట్టుకుంటాం 
బైక్‌లో వెళుతూ రన్నింగ్‌లోని వాహనం లాక్‌ కట్‌ చేసి..లోపలికి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా వాహనంలో నుంచి వస్తువులను కింద పడేస్తారు. వెనుక ఉన్నవారు వాటిని తీసుకుంటారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతానికి చెందిన వారే అని తెలుస్తోంది. కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. త్వరలోనే పట్టుకుంటాం.  
– ఫక్కీరప్ప, ఎస్పీ, కర్నూలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top