ఫిబ్రవరిలో రెవెన్యూ సదస్సులు | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో రెవెన్యూ సదస్సులు

Published Fri, Jan 24 2014 2:46 AM

revenue Seminars in adilabad district

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: ఫిబ్రవరిలో చేపట్టబోయే రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు మంత్రి, సీసీఎల్‌ఏ కమిషనర్ కృష్ణరావుతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
 
 ఈ సదస్సుల్లో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. సదస్సు నిర్వహణ షెడ్యుల్ ఈనెల 31లోగా తయారు చేయాలని సూచించారు. సదస్సుల నిర్వహణకు ముందు గ్రామాల్లో ప్రచారం కల్పించాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేసి సదస్సుల నిర్వహణ గురించి తెలియజేయాలన్నారు. సదస్సులు ప్రారంభం రోజున మంత్రులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న వీఆర్‌ఏ, వీఆర్వో పరీక్షలకు పోలీసు బందోబస్తు పకడ్బందీంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో శ్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమలు లేని ప్రాంతాల్లో ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.
 
 వీఆర్‌ఏ, వీఆర్‌వో అభ్యర్థుల  సమస్యలు పరిష్కరించండి..
 జిల్లాలో వీఆర్‌ఏ, వీఆర్‌వో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లాలోని పది ప్రాంతాల్లో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశామని కలెక్టర్ అహ్మద్‌బాబు మంత్రికి వివరించారు. కాగా అభ్యర్థులకు వీఆర్‌వో పరీక్ష ఓ ప్రాంతంలో, వీఆర్‌ఏ పరీక్ష మరో ప్రాంతంలో హాల్‌టికేట్లు జారీ చేసినందున దాదాపు 100 మంది మధ్యాహ్నం జరిగే పరీక్ష రాయలేకపోతున్నారని, వీటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనికి స్పందించిన సీసీఎల్‌ఏ కమిషనర్ అలాంటి అభ్యర్థుల వివరాలు సేకరించి పంపించాలని, అలాంటి వారికి ఒకేచోట పరీక్ష రాసేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీఆర్‌ఏ, వీఆర్‌వో పరీక్ష కేంద్రాలు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించబడిన అభ్యర్థులు జనవరి 25లోగా జిల్లా రెవెన్యూ అధికారికి వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు కలెక్టర్ తెలిపారు. వీఆర్‌ఏ, వీఆర్‌వో పరీక్ష రాసే అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోగ్రఫీలు పరీక్ష కేంద్రాల్లో సేకరిచబడుతాయన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ పనసారెడ్డి, డీఆర్‌ఓ ఎస్‌ఎస్ రాజు, ఆర్‌డీవో సుధాకర్‌రెడ్డి, ఎన్నికల తహశీల్దార్ కిషన్, కలెక్టరేట్ ఏవో సంజయ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement