తన కూతురు ఆత్మహత్యకు ఓ కుటుంబం కారణం అని భావించాడు ఆ తండ్రి.
► ఛేదించిన పోలీసులు
► ముగ్గురి నిందితుల అరెస్టు
ఎచ్చెర్ల : తన కూతురు ఆత్మహత్యకు ఓ కుటుంబం కారణం అని భావించాడు ఆ తండ్రి. ఆ కుటుంబంలో ఒకరిని హతమార్చాలనుకున్నాడు. అందుకు పథకం వేశాడు. అనుకున్నట్టుగా వల పన్ని హత్య చేయిండాడు. అంతేకాదు మృతదేహం సైతం కనిపించకుండా తగలబెట్టించాడు. పోలీసులు ఈ కేసును నాలుగురోజుల్లో చేధించారు. ఈనెల 15న పొందూరు మండలం ధర్మపురం-బురికంచారం సరిహద్దులో యువకుడిని హత్య చేసి తలబెట్టిన సంఘటనలోని నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఆ నిందితులను మీడియా ముందు హాజరు పర్చిన శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావు నాయుడు హత్య వివరాలను వెల్లడించారు.
ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసకి చెందిన పుండ్రోతు వెంకటరావు, పందిరపల్లి వెంకటరావు సమీప బంధువులు. పుండ్రోతు వెంకటరావు తన కుమార్తె చందును మేనళ్లుడు అశోక్‌తో వివాహం చేయాలనుకున్నాడు. అయితే ఈ సంబంధం జరక్కుండా పందిరపల్లి వెంకటరావు కుటుం బం.. చందుపై వ్యక్తిగత దుష్ర్పచారం చేసినట్టు పుండ్రోతు కుటుంబం ఆరోపణ. దుష్ర్పచారంతో మనస్థాపానికి గురైన చందు ఐదు నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చందుకు తల్లిదండ్రులు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించారు. అప్పుడే పుండ్రోతు వెంకటరావు తన కుమార్తె ఆత్మహత్యకు కారణం అయిన పందిరపల్లి వెంకటరావు కుమారుడు భరత్(17)ను చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో తన స్నేహితుడైన కిల్లాన అప్పారావును హత్యకు సహకరించమని కోరాడు. అలాగే అప్పారావు దుక్కా కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తిని హత్యకు సహాయం తీసుకున్నాడు. పుండ్రోతు వెంకటరావు రూ.80 వేలు అప్పారావుకు ఇవ్వగా.. అప్పారావు కల్యాణ చక్రవర్తికి రూ.70వేలు ఇచ్చాడు. దీంతో కల్యాణ చక్రవర్తి సెకెండ్ హ్యాండ్ బైక్ కొని భరత్‌తో స్నేహం చేయటం ప్రారంభించాడు. భరత్ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో పాలిటెక్నిక్ డిప్లమా చేశాడు. మూడు నెలలుగా వీరు స్నేహం చేస్తూ ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. 15వ తేదీ సాయంత్రం కల్యాణ చక్రవర్తి బైక్‌పై భరత్‌ను తీసుకువెళ్లాడు.
ఇద్దరూ చిలకపాలెం వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేశారు. అనంతరం చిలకపాలెం వద్ద గల ఐచర్ కంపెనీ సమీపంలోకి వెళ్లి కల్యాణచక్రవర్తి..భరత్‌కు మద్యం తాగించాడు. తాను తాగుతున్నట్లు నటించి భరత్‌కు పూటుగా పట్టాడు. భరత్ అపస్మారక స్థితికి చేరుకున్నాక పీక నులిపి చంపేశాడు. అనంతరం పుండ్రోతు వెంకటరావు, కిల్లాన అప్పారావులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ సంఘటన జరగ్గా రాత్రి 11 గంటల సమీపంలో పుండ్రోతు వెంకటరావు తన ట్రాక్టర్ తీసుకుని వెళ్లి మృతదేహాన్ని అక్కడ నుంచి ధర్మపురం-బురిడి కంచరాం చెరకు తోటల్లోకి తీసుకువెళ్లారు.
తోటల్లో మృతదేహంపై టైర్, గడ్డి, కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. అనంతరం ఎస్‌ఎంపురం సమీపంలో జీడిమామిడి తోటల్లో భరత్ సెల్‌ఫోన్, వారు ఉపయోగించిన హ్యాండ్ గ్లౌవ్స్, కిరోసిన్‌క్యాన్ తగల బెట్టారు. 16న హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసును ఛేందించిన పోలీసులు నిందితులు పుండ్రోతు వెంకటరావు, దుక్కా కల్యాణ చక్రవర్తి, కిల్లాన అప్పారావుపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్, బైక్, రూ.32 వేలు నగదు, ఖాళీ మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారి సీఐ సాకేటి విజయ్‌కుమార్, ఎచ్చెర్ల,లావేరు, పొందూరు ఎస్సైలు పీవీబీ ఉదయ్‌కుమార్, అప్పారావు, ఆర్‌హెచ్‌ఎన్‌వీ కుమార్ పాల్గొన్నారు.
కేసును ఇలా ఛేదించారు..
ఈ కేసును జేఆర్‌పురం సీఐ విజయకుమార్ దర్యాప్తు చేశారు. 15 వతేదీ ఉదయం నుంచి భరత్ కనిపించడంలేదని అతని తండ్రి ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్యాణ చక్రవర్తి తన కుమారుడుని బైక్‌పై తీసుకుని వెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. దీంతో సీఐ కణ్యాణ చక్రవర్తిని విచారించారు. దీంతో హత్య పథకం బట్టబయలైంది.