అంగన్‌వాడీల్లో మళ్లీ హలో.. హలో.. | Restore cell phone service in anganwadi centres | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో మళ్లీ హలో.. హలో..

Jan 6 2014 4:31 AM | Updated on Jun 2 2018 8:36 PM

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మళ్లీ హలో.. హలో.. వినిపించనుంది. గత రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ సేవలు నిలిచాయి.

ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మళ్లీ హలో.. హలో.. వినిపించనుంది. గత రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ సేవలు నిలిచాయి. బకాయి బిలుల్లు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీఓలు రాష్ట్ర అధికారులకు ఎస్‌ఎంఎస్‌లు చేయకపోవడంతో రోజువారి, వారంతపు, నెల సమాచారం కొరవడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో బీఎస్‌ఎన్‌ల్ కంపెనీకి బకాయి పడిన రూ.5లక్షలను విడుదల చేసింది. దీంతో అంగన్‌వాడీల్లో సెల్ సేవలు పునరుద్దరణ అయ్యాయి. సెల్ ద్వారా సోమవారం నుంచే ఎస్‌ఎంఎస్‌తో ఆన్‌లైన్‌లో ప్రతి సమాచారం రాష్ట్ర అధికారులకు చేరవేయాలని  ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాములు జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్‌వైజర్లకు, సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరి ఎస్‌ఎంఎస్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తే వేతనంలో కోతలు విధిస్తామని హెచ్చరికలూ పంపారు.
 
 మూడు రకాల సమాచారం..
 మినీ, మెయిన్ కలిపి జిల్లాలో మొత్తం 2400లకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మొదటగా ఇందులో పని చేసే కార్యకర్తలు ప్రతి రోజు 11 నుంచి 12గంటల్లోపు పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్)లో ఎందరు పిల్లలు వచ్చారు, ఎందరికి భోజనం పెట్టారు అనే వివరాలతో పాటు గర్భిణులు, బాలింతలు వివరాలు ఐసీడీఎస్ డెరైక్టరేట్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. రోజు వారీగా సరుకుల ఖర్చు, బ్యాలెన్స్ వివరాలను కూడా చేరవేయాలి. రెండోది సందర్భ సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు జరిగిన వెంటనే సమాచారమందించాలి. మూడోది ప్రతి నెలా అంగన్‌వాడీ ప్రోగ్రెస్ రిపోర్టులను ఎస్‌ఎంఎస్ చేయాలి. కార్యకర్త, సూపర్‌వైజర్, సీడీపీఓలు ఇక ప్రతీది ఎస్‌ఎంఎస్ ద్వారానే సమాచారమందించాలి.


 నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు..
 -రాములు, ఐసీడీఎస్ పీడీ
 రెండు నెలల క్రితం నిలిచిపోయిన సెల్‌ఫోన్ సేవలు ప్రభుత్వం నిధులు మంజురు చేయడంతో పునరుద్దరణ చేయించాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు, సూపర్‌వైజర్లు, సీడీపీఓలు రోజువారీ సమాచారాన్ని తప్పకుండా పంపించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఆదేశాలను విధిగా పాటించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement