
సాక్షి, అమరావతి: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అమీర్‌బాబు వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అమీర్‌ను సోమవారం వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌గా సీఎం నియమించారు. 25 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని ఉంటే తనకు చైర్మన్ పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. జలీల్‌ఖాన్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాజీనామా పత్రాన్ని ఇచ్చి ఆయన వెళ్లిపోయారు.
అనంతరం సీఎం చంద్రబాబును కలసి తన అసంతృప్తిని తెలియజేశారు. సీఎం వారించినా పట్టించుకోకుండా అమీర్‌బాబు వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో రాజీనామా పత్రాన్ని జలీల్‌ఖాన్‌కు అందజేశారు. ముఖ్యమంత్రికి కూడా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన జాయింట్ పార్లమెంటరీ పార్టీ వక్ఫ్‌బోర్డు సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
బాధ్యతలు స్వీకరించిన జలీల్ ఖాన్
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎన్నికైన మరో ఎనిమిది మంది సభ్యులు సోమవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా జలీల్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు స్థలాల పరిరక్షణ కోసం నూతన విధానాన్ని ప్రవేశపెడతామన్నారు.