చట్టాలు కొందరికేనా? | reservations not applicable in promotions | Sakshi
Sakshi News home page

చట్టాలు కొందరికేనా?

Sep 7 2014 1:44 AM | Updated on Sep 2 2017 12:58 PM

సమాజంతో పాటు సమానంగా పరిగెత్తలేకపోయినా అవమానాలు భరించి..

తాళ్లూరు:  సమాజంతో పాటు సమానంగా పరిగెత్తలేకపోయినా అవమానాలు భరించి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వికలాంగుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల పోరాటం  అనంతరం భారత ప్రభుత్వం పీడబ్లూడీ యాక్ట్-1995 విడుదల చేసింది. దీని ప్రకారం వికలాంగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. అయితే అప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో ప్రభుత్వ శాఖల్లోని వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘ ఆసియన్ పసిఫిక్ ఒప్పదం 1993- 2002’ ఏర్పడింది.

దీనిని కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో  హైదరాబాద్‌కు చెందిన డీఏఈడబ్ల్యూఎస్ (వికలాంగుల సంఘం) పోరాటం చేయడంతో..  ఆంధ్రప్రదేశ్ 2011 అక్టోబర్ 19న జీఓ నంబర్ 42 విడుదల చేసింది. దీని ప్రకారం వికలాంగుల ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లలో 3శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఇంత చేసినా.. సాధించుకున్న జీఓ కూడా బుట్ట దాఖలే అయింది. దీనివల్ల రాష్ట్రంలో 2వేల మంది ఉద్యోగులు నష్టపోతుండగా.. జిల్లాలో వందమంది దాకా లబ్ధి పొందలేకపోతున్నారు.

 ఏబీసీడీ వర్గాలకూ ఓకే..
 వికలాంగులు సమస్యలపై కొంతమంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. 4 ఆగస్టు 2010న  వికలాంగ రిజర్వేషన్లను ఏబీసీడీ వర్గాలకు కూడా ఇవ్వాలంటూ తీర్పు (డబ్ల్యూపీసీ 2821/2011) ఇచ్చింది. మూడు నెలల్లో అమలు చేయాలంటూ ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటీషన్ వేయగా అక్కడ కూడా సానుకూలంగానే తీర్పు లభించింది.

ఇదిలా ఉంటే ముంబై, ఒడిస్సా హైకోర్టుల తీర్పుల అనంతరం ఆయా రాష్ట్రాల్లో వికలాంగ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కూడా వికలాంగులకు సానుకూలంగా 2013 మార్చి 5న తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జూలై 14న ప్రభుత్వం జీఓ నంబర్ 2593 విడుదల చేసింది. కోర్టుకు విన్నవించుకున్న వికలాంగ ఉద్యోగులకు తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు మొదలు కాలేదు.

 ప్రొమోషన్లు లేకుండా రిటైర్డ్ అవుతున్నారు: హనుమంతరావు: ఏఈ, పీఆర్, యూనియన్ రాష్ట్ర  సెక్రటరీ
 ప్రమోషన్లు, బదిలీల విషయంలో వికలాంగ ఉద్యోగులకు దశాబ్ద కాలంగా అన్యాయం జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కోర్టుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తున్నారు. ఇక్కడ హైకోర్టు కూడా స్పందించింది. ఆ తర్వాత  రెండు జీఓలు వచ్చాయి. కానీ వాటిని అమలు చేయటంలో ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రమోషన్లు లేకుండా రిటైర్డు అవ్వాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement