ఆర్టీసీపై అద్దె భారం

Rental Burden On Tirupati RTC - Sakshi

బస్టాండ్లు, పార్కింగ్‌లపై టీటీడీ మోత

భారాన్ని మోయలేమంటున్న ఆర్టీసీ

నేడు ఈఓ సింఘాల్‌తో ఆర్టీసీ ఎండీ భేటీ

తిరుపతి సిటీ :తిరుపతి ఆర్టీసీపై టీటీడీ అద్దెల భారం మోపింది. ఉన్నపళంగా బస్టాండ్లు, పార్కింగ్‌ స్థలాల అద్దెలను  పెంచేసింది.  ఆర్టీసీపై నెలకు రూ.1.74 కోట్ల భారం పడనుంది. ఈ నేపథ్యంలో  పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు  శుక్రవారం తిరుపతికి  వస్తున్నారు.  టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను కలిసి  ఈ విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు.   ఇటీవల టీటీడీ అమాంతంగా పెంచిన అద్దెల విషయంతో పాటు, తిరుమల ఘాట్‌ రోడ్లలో అనధికారికంగా  తిరుగుతున్న వాహనాలను నిలిపివేయాలనే అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు ఆర్‌ఎం కార్యాలయంలో డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో ఎండీ సమావేశం కానున్నారు. అందుకోసం ఆర్‌ఎంతోపాటు ఇతర అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నెలకు రూ. 1. 74 కోట్ల అద్దె
టీటీడీ ఆధ్వర్యంలో గతంలో నడుస్తున్న రవాణా విభాగం 1975–80 మధ్య కాలంలో ఆర్టీసీలో విలీనం చేశారు. రవాణా విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన 120 మందికి పెన్షన్‌ రూపంలో రూ. కోటి 50 లక్షలు ప్రతి నెలా చెల్లించేలా ఆర్టీసీ ఒప్పందం  చేసుకుంది. ఈ ఒప్పందం ఆర్టీసీకి పెను భారంగా మారింది. అదేవిధంగా తిరుమలలో ఆర్టీసీ డిపో భవనాలు, బస్‌ స్టేషన్, గ్యారేజ్‌ స్థలం,  అలిపిరి డిపో ఉన్న భవనాలు, బాలాజీ లింక్‌  బస్టాండు స్థలంతో పాటు విష్ణు నివాసం, శ్రీనివాసంలో కొన్ని స్థలాలకు కలిపి ప్రతి నెలా రూ. 24 లక్షలు అద్దె  చెల్లిస్తున్నారు. దీంతో పాటు  టీటీడీకి ప్రతినెలా చెల్లిస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ డబ్బులు రూ. కోటి 50 లక్షలను తిరుపతి డివిజన్‌ పరిధిలో ఉన్న 7 డిపోలకు వాటాలు వేస్తారు.  దీంతో ప్రతినెలా కోటి 74 లక్షలు అదనంగా టీటీడీకి చెల్లిస్తున్నారు.  ప్రధానంగా అలిపిరి, తిరుమల, తిరుపతి డిపోల మీదనే ఈ అద్దెల  భారం పడుతోంది. 

 రూ. 23.33 కోట్ల నష్టం
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి రూ. 23.33 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో భాగంగా  ఫిబ్రవరి నెలలో రూ.10 కోట్ల 33 లక్షలు, మార్చి నెలలో రూ. 17 కోట్ల నష్టం వాటిల్లింది. అదేవిధంగా మార్చిలో   మంగళం డిపోకు రూ. 2 కోట్లు, తిరుపతి డిపోకు 3.85 కోట్లు, తిరుమల డిపోకు రూ. 3 కోట్లు, తిరుమల డిపోకు రూ. 5 కోట్ల చొప్పున నష్టం వచ్చింది. మాములుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ  పరిస్థితుల్లో నైనా  అలిపిరి, తిరుమల డిపోలు లాభాల దిశగా నడిచేవి . కానీ ఈ ఏడాది జనవరి నుంచి ఆ రెండు డిపోలు కూడా నష్టాల బాట పట్టాయి. దీంతో ఆర్టీసీ అయోమయంలో పడింది.

 ఆర్టీసీ రాయితీల్లో కోత ?
టీటీడీకి నెలవారిగా  ఆర్టీసీ చెల్లిస్తున్న అద్దెలను తగ్గించని పక్షంలో టీటీడీ ఉద్యోగులకు ఆర్టీసీ ఇస్తున్న రాయితీ పాసులను  తగ్గించే  యోచనలో ఉన్నట్లు  సమాచారం. టీటీడీ ఈవోతో ఆర్టీసీ ఎండీ భేటీ అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు.  అలాగే తిరుమలకు ప్రయివేట్‌ వాహనాలు, ట్యాక్సీలు, జీపులను తిరగకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టి  ఆర్టీసీకి సహకరించాలని ఎండీ సురేంద్రబాబు  ఈఓ ను  కోరనున్నారు.  

విచ్చలవిడిగా  ప్రయివేట్‌ వాహనాలు
 భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కలిగిన ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ, కొండకు ఎక్కువగా ప్రయివేట్‌ వాహనాలు, ట్యాక్సీలు, జీపులకు అనుమతి ఇస్తుండడంతో ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. కొన్ని ప్రయివేట్‌ వాహనాలు కండీషన్‌లో లేకపోయినప్పటికీ టీటీడీ, రవాణా శాఖ అధికారులు కొండకు అనుమతి ఇస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ఆయా ప్రవేట్‌ ట్యాక్సీలు, జీపుల ద్వారా మాముళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీకి వస్తున్న నష్టాలను  ఆర్‌ఎం, ఇతర అధికారులు ఎండీ సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎండీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుపతికి రానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top