108 ఉద్యోగులపై సర్కారు కక్ష

Remove of 2,400 employees in 108 vehicles - Sakshi

2,400 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

కొత్త నియామకాలకు ప్రకటన జారీచేసిన నిర్వహణ సంస్థ

వారం రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు

సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

పోరాటం కొనసాగిస్తామంటున్న108 ఉద్యోగుల సంఘం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 వాహనాల్లో పనిచేస్తున్న సుమారు 2400 మంది ఉద్యోగులను తొలగించేందుకు సర్కారు పూనుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించేం దుకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వారం రోజుల కిందట తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 6 నుంచి సమ్మెలోకి వెళతామని నోటీసులో పేర్కొ న్నారు. ఈ నోటీసును అందుకున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోగా.. వారిని తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని వార్తా పత్రికల్లో ప్రకటన ఇప్పించింది.

108 వాహనాల నిర్వహణ సంస్థ బీవీజీ(భారత్‌ వికాస్‌ గ్రూప్‌) సంస్థ ఈ ప్రకటన జారీచేసింది. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు, పైలెట్స్‌ (డ్రైవర్లు) కావాలని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళగిరిలోని తమ కార్యాలయంలో వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల నిర్వహణను సరిగా పట్టించుకోకపోవడం లేదు. వేతనాలు జాప్యం, కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు.

కండీషన్‌లో లేని వాహనాలుప్రాణాప్రాయ స్థితిలో, అత్యవసర సమయాల్లో రోగులను, బాధితులను ఆదుకునేందుకు కూతవేటు దూరంలో అందుబాటులో ఉండే 108 వ్యవస్థను ప్రభుత్వం దారుణ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. సేవలకు వీలుగా వాహనాలను ఉంచాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న సిబ్బంది మెడపై తాజాగా తొలగింపు కత్తి పెట్టింది. కండీషన్‌లో లేని 108 వాహనాలను సరిచేయాలన్న విన్నపాలు వినిపించుకోకపోగా వాటి రిపేర్ల ఖర్చులను డ్యూటీలోని సిబ్బంది భరించాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సర్వీసులో తిరగని వాహనాలను కూడా తిరుగుతున్నట్లు సీఎం డ్యాష్‌బోర్డులో చూపిస్తూ మోసం చేస్తున్నారు.

వాహనాల్లోని పేషెంట్ల క్యాబిన్లలో ఏసీ, లైట్లు పనిచేయవు. బీపీ, స్టెత్‌స్కోప్, గ్లూకోమీటర్లు లాంటి పరికరాల్లో పనిచేయనివే ఎక్కువగా ఉన్నాయి. అధికశాతం వాహనాలలో ఆక్సిజన్, కాటన్, డ్రస్సింగ్‌ ప్యాడ్స్, స్టెటరలైజ్డ్‌ దూది, అయోడిన్‌ కూడా ఉండడం లేదు. స్ట్రెచ్చర్‌లు ఉపయోగపడటంలేదు. చాలా వాహనాలకు బీమా సౌకర్యం, పొల్యూషన్‌ సర్టిఫికెట్లు లేవు. వాహనాలకు సకాలంలో ఇంజనాయిల్‌ కూడా మార్చడంలేదు. వాహనాల టైర్లు అరిగి పోయి, ఊడిపోయి తిరగడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. హెడ్‌లైట్లు పనిచేయవు. బ్యాటరీ నిర్వహణలేదు. వర్షం పడితే అనేక వాహనాల్లోకి నీరు కారుతోంది.

రాజధాని జిల్లా అయిన కృష్ణాలో ఇటీవల ఓ గర్భిణీని తీసుకెళుతుండగా వాహనం మొరాయించింది. చివరకు ఆమెను ఆటోలో ఆస్పత్రికి చేర్చాల్సి వచ్చింది. వైఎస్సాఆర్‌ కడప, నెల్లూరు జిల్లాల్లో వాహనాలు ఎక్కువగా షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1100 నెంబరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని సిబ్బంది వాపోతున్నారు.

సమస్యల పరిష్కారం కోరితే బెదిరింపులా?
దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించి వాహనాల నిర్వహణను మెరుగుపర్చాలని కోరితే కొత్తగా ఉద్యోగ ప్రకటన ఇస్తారా అని ఉద్యోగుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈనెల 5వ తేదీలోపు చర్చలకు ఆహ్వానించారని, ఆరోజు తమకు హామీ లభించకపోతే నోటీసులో పేర్కొన్నట్టు 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రెండు మాసాల కిందట ప్రభుత్వమే చర్చలు జరిపి, పరిష్కారానికి హామీ ఇచ్చినా అది చేయకుండా ఉద్యోగులను వేధిస్తోందని, ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన తాము భయపడతామని అనుకోవడం పొరపాటు అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, తాము కూడా పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. నేడో రేపో 104 ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు.

మొత్తం 108 వాహనాల సంఖ్య: 417
ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలు: 297
ఆగిపోయిన వాహనాలు: 120
తిరుగుతున్న వాటిలో ఆక్సిజన్‌ లేని వాహనాలు: 97

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top