రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం.. వ్యూహాలకు పదును పెట్టడం సర్వసాధారణం. కానీ ఏకంగా ఇతర పార్టీలకు పడే ఓట్లపై వేటు...
- వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటుపై టీడీపీ కుట్ర
- ఓటరు స్లిప్‌ల పంపిణీలో గిమ్మిక్కులు
- పెనమలూరులో వెలుగులోకి
- ఓటరు స్లిప్ లేకున్నా అనుమతిస్తామన్న కలెక్టర్
సాక్షి, మచిలీపట్నం : రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం.. వ్యూహాలకు పదును పెట్టడం సర్వసాధారణం. కానీ ఏకంగా ఇతర పార్టీలకు పడే ఓట్లపై వేటు వేసేందుకు జరిగే ప్రయత్నాలను మాత్రం ఎవరూ హర్షించరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేకచోట్ల ఓటరు జాబితాల్లో తమకు అనుకూలంగా ఉండేవారి ఓట్ల నమోదు, వ్యతిరేక పార్టీకి చెందినవారివి తొలగింపు అనేక పర్యాయాలు వివాదాస్పమైన సంగతి తెల్సిందే. తాజాగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడ పన్నింది.
జిల్లాలో పలు పంచాయతీల్లో తమకు అనుకూలంగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, సిబ్బందిని ప్రయోగించి వైఎస్సార్‌సీపీకి అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్‌లు ఇవ్వకుండా అడ్డుకుంది. గతంలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటరు స్లిప్ ఇచ్చినా దాన్ని తీసుకుని వెళితే పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ ఇచ్చేవారు. ఆ బ్యాలెట్‌లో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేవారు. కానీ ఈసారి పార్టీలు, అభ్యర్థులు గుర్తులతో ఇచ్చే ఓటరు స్లిప్‌లను అనుమతించేది లేదని, నేరుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇచ్చే ఓటరు స్లిప్‌లనే అనుమతిస్తామంటూ ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టింది.
దీంతో ఈసారి ఎన్నికల్లో ప్రతీ ఇంటికి ఆయా గ్రామాల్లోని సిబ్బంది ఓటరు స్లిప్‌ల పంపిణీ చేపట్టారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు మెలికను టీడీపీ నేతలు ఇక్కడే పెట్టారు. ఓటరు స్లిప్ లేకుండా ఓటు లేదనుకునో, ఓటు వేయనివ్వరనుకునో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మానేస్తారు. దీంతో టీడీపీ వ్యతిరేక ఓటుకు అడ్డుకట్ట వేసే కుట్ర గ్రామాల్లో పురుడుపోసుకుంది.
ఇది పెరిగి పెద్దదై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు, ఆయా గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎన్నికల దిగువస్థాయి సిబ్బందిని తమ చేతిలోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు పెనమలూరు నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పడే ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అవి పడకుండా వేటు వేసేందుకు ఓటరు స్లిప్‌లు ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి.
కానూరులో వెలుగులోకి...
పెనమలూరు మండలం కానూరు పంచాయతీలో ఓటరు స్లిప్‌లను అంగన్‌వాడీ వర్కర్‌కు బదులు వార్డు సభ్యుడి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే ఆ వార్డు సభ్యుడు ఒక ఇంటి వద్దకు వెళ్లి మొదట ఓటరు స్లిప్‌లు ఇచ్చాడు. మీరు ఓటు ఎవరికి వేస్తారని ఆ ఇంటి యజమానిని పంచాయతీ వార్డు సభ్యుడు ప్రశ్నించాడు. దీంతో నేను వైఎస్సార్‌సీపీకి ఓటేస్తానని ఇంటి యజమాని బదులివ్వడంతో అతనికి ఇచ్చిన ఓటరు స్లిప్‌ను లాగేసుకుని వెళ్లిపోయినట్టు అతను వైఎస్సార్‌సీపీ నాయకుల దృష్టికి తేవడంతో ఈ వ్యవహారం గుప్పుమంది. ఇలా జిల్లాలో చాలా చోట్ల ఓటర్లకు స్లిప్‌లు ఇవ్వకుండా కుట్ర చేశారని చెబుతున్నారు. ఓటరు స్లిప్ లేకుంటే తమ ఓటు లేదనో, స్లిప్ ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయనివ్వరనో కారణంతో చాలా మంది ఓటర్లు ఓటుకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
తెల్లకాగితంపై రాసి తెచ్చినా ఓటిస్తాం : కలెక్టర్
ఓటరు స్లిప్ లేదని కంగారుపడనవసరం లేదని, తెల్ల కాగితంపై వివరాలు రాసుకుని వచ్చినా ఓటిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పష్టం చేశారు. పెనమలూరులో జరిగిన ఉదంతాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారుల నుంచి ఆరా తీస్తానని ఆయన తెలిపారు. ఓటరు స్లిప్ అందలేదని ఓటర్లు కంగారు పడక్కర్లేదని చెప్పారు. పార్టీల గుర్తులు, రంగులు లేని తెల్లకాగితంపై ఓటరు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ వంటివి రాసుకుని తెస్తే ఓటు వేసే అవకాశం ఇస్తామని అన్నారు. ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
పెనమలూరులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
పెనమలూరులో వైఎస్సార్‌సీపీ అనుకూల ఓట్లను పడకుండా చేసేందుకు టీడీపీ చేసిన కుట్రను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విజయవాడ సబ్ కలెక్టర్ దాసరి హరిచందనకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ‘సాక్షి’కి శనివారం రాత్రి చెప్పారు. ఓటు వేసేందుకు కీలకమైన ఓటరు స్లిప్‌లు మండల కార్యాలయాలు, పంచాయతీల్లో ఇచ్చి పర్యవేక్షణ చేయకపోవడంతో వాటి పంపిణీలో పక్షపాత ధోరణులు ఉన్నాయని సురేష్‌బాబు తెలిపారు. ఓటరు స్లిప్‌లు లేవని కంగారుపడవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామంటూ సబ్‌కలెక్టర్ హరిచందన హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద హెల్స్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఓటరు స్లిప్‌లు లేనివారికి వాటిని అందించేలా చర్యలు తీసుకుంటానని సబ్‌కలెక్టర్ తెలిపారని ఆయన వెల్లడించారు.