గదుల ముందస్తు బుకింగ్‌ రద్దు చేస్తే రిఫండ్‌ | Refund if canceled prior to booking rooms in TTD | Sakshi
Sakshi News home page

గదుల ముందస్తు బుకింగ్‌ రద్దు చేస్తే రిఫండ్‌

Jun 3 2017 12:49 AM | Updated on Jul 29 2019 6:06 PM

గదుల ముందస్తు బుకింగ్‌ రద్దు చేస్తే రిఫండ్‌ - Sakshi

గదుల ముందస్తు బుకింగ్‌ రద్దు చేస్తే రిఫండ్‌

ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న గదులు తిరిగి రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రిఫండ్‌ చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

- టీటీడీ ఈవో సింఘాల్‌ వెల్లడి
కంపార్ట్‌మెంట్లలో ఉచిత ఫోన్, హెల్ప్‌డెస్క్‌ సౌకర్యం
 
సాక్షి, తిరుమల: ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న గదులు తిరిగి రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రిఫండ్‌ చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గది పొందిన తర్వాత కూడా నిర్ణీత సమయాని కంటే ముందుగా ఖాళీ చేసినా కొంత నగదు తిరిగి చెల్లిస్తామని శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ తర్వాత జూలై నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు తమ బంధువులతో మాట్లాడేందుకు వీలుగా ఉచితంగా ఫోన్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి, ప్రతి కంపార్ట్‌మెంట్‌లోనూ జూన్‌ నెలాఖరులోగా ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
 
లక్కీడిప్‌ పద్ధతిలో ఆర్జిత సేవాటికెట్లు
సెప్టెంబర్‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 16 ఉదయం 11 గంటల నుంచి లక్కీడిప్‌ పద్ధతిలో కేటాయిస్తామని ఈవో తెలిపారు. ఈ కొత్త విధానంలో మొదటి మూడు రోజులపాటు భక్తులు కోరుకున్న సేవా టికెట్ల కోసం నమోదు చేసుకుంటారని, ఆ తర్వాత కంప్యూటర్‌ ర్యాండమ్‌ విధానంలో లక్కీడిప్‌ ద్వారా టికెట్లు కేటాయిస్తామన్నారు. 
 
యాగఫలంతో విస్తారంగా వర్షాలు..
తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన కారీరిష్టియాగం, వరుణజపం ఫలితంగా వర్షాలు విస్తారంగా కురిసి దేశం, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని టీటీడీ ఈవో సింఘాల్‌ ఆకాంక్షించారు. శుక్రవారం పారువేట మండపం, వరాహస్వామి ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో వరుణయాగం ముగిసింది. వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, తద్వారా దేశంలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో సుమారు 30 మంది రుత్వికులు ఈ యాగం నిర్వహించారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement