‘రెడ్’ కార్పెట్ చిత్తూరు! | 'Red' carpet Chittoor! | Sakshi
Sakshi News home page

‘రెడ్’ కార్పెట్ చిత్తూరు!

Oct 17 2013 2:26 AM | Updated on Sep 1 2017 11:41 PM

జిల్లా నుంచి కోట్ల రూపాయల విలువజేసే ఎర్రచందనం నిత్యం అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు చి త్తూరు పట్టణం ప్రధాన రహదారిగా మారింది.

 

=ఎర్రచందనం అక్రమ రవాణాకు రాచమార్గం
=తమిళనాడు నుంచి శేషాచలం కొండలకు యథేచ్ఛగా ‘ఎర్ర’ కూలీల రాక
=అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా లేకపోవడమే కారణం
=వేలూరు వయా నరహరిపేట చెక్‌పోస్టు మీదుగా ప్రవేశం

 
 సాక్షి, చిత్తూరు: జిల్లా నుంచి కోట్ల రూపాయల విలువజేసే ఎర్రచందనం నిత్యం అక్రమంగా తరలిపోతోంది. ఇందుకు చి త్తూరు పట్టణం ప్రధాన రహదారిగా మారింది. శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు కూలీలు తమిళనాడు నుంచి చిత్తూరు పట్టణం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. శే షాచలం అడవుల్లోకి దాదాపు 170-200 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు నార్త్ ఆర్కాట్, సేలం, తిరువణ్ణామలై జిల్లాల నుంచి ఎర్రచందనం నరికేందుకు కూలీలు వందల సంఖ్యలో బ్యాచ్‌లు, బ్యాచ్‌లుగా ప్రతి రోజూ వస్తున్నారు.

వీరు ఏ వాహనంలో వచ్చినా చిత్తూరు-వేలూరు అంతర్రాష్ట్ర రహదారి లేదా, గుడియాత్తం, యాదమరి మీదుగా చిత్తూరుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతి సమీపంలోని అటవీప్రాంతాలకు చేరుకోవాల్సిందే. అటవీ ప్రాంతానికి చేరుకోకముందే వీరిని నిరోధించి అదుపులోకి తీసుకునే చర్యలు దాదాపుగా లేవు.

గుడిపాల మండలం వద్ద తమిళనాడు నుంచి ప్రవేశించే మార్గంలో నరహరిపేట చెక్ పోస్టుతో పాటు, ప్రధాన రహదారిపైనే గుడిపాల పోలీసు చెక్‌పోస్టు ఉంది. తమిళనాడు నుంచి వచ్చే ఏ వాహనం అయినా ఈ మార్గంలోనే రావాలి. ఇక్కడ పోలీసులు, అటవీశాఖ సంయుక్తంగా చిత్తూరు వైపు వస్తున్న వాహనాల్లో అనుమానం వచ్చిన వాటిని తనిఖీ చేస్తే కచ్చితంగా ఎర్రచందనం నరికే తమిళ కూలీలను ముందేపట్టుకోవచ్చని అటవీశాఖలోని ఓ అధికారి వెల్లడించారు.
 
సరిహద్దుల్లో నిఘా అవసరం


 తిరుపతి సమీపంలోని ఐతేపల్లె వద్ద గతంలో అటవీశాఖ అధికారులు నిఘావేసి తమిళనాడు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న చాలా మంది తమిళ కూలీలను పట్టుకున్నారు. రెండు నెలల క్రితం పనపాకం వద్ద అడవిలోకి ప్రవేశిస్తున్న తమిళ కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పోలీసు పరిధిలోని రేణిగుంట సబ్ డివిజన్‌లోని మామండూరు వద్ద లారీల్లో వచ్చి అడవిలోకి ప్రవేశిస్తున్న తమిళతంబీలను రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ నిత్యం జిల్లా నుంచి ఎర్రచందనం తరలుతూనే ఉంది. ఈ నిఘా చిత్తూరు సరిహద్దుల్లోనే చేపడితే ఇక్కడి వరకు ఎర్రదొంగలు రారని అటవీశాఖవర్గాలే చెబుతున్నాయి.
 
 స్మగ్లర్ల రూటే వేరు...

 శేషాచలం కొండల నుంచి ఎర్రచందనాన్ని చిత్తూరు మీదుగా రాణిపేట బైపాస్ ద్వారా చెన్నై ఓడరేవుకు తరలిస్తున్నారు.

 తిరుపతి పరిసరాల్లో మామండూరు అడవుల్లో నరికే ఎర్రచందనం శ్రీకాళహస్తి వయా తడ మీదుగా చెన్నై శివార్లలోని గోడౌన్లకు తరలిస్తారు. అక్కడి హార్బర్ నుం చి షిప్పుల్లో విదేశాలకు వెళుతుంది.
     
 రేణిగుంట, గాజులమండ్యం మీదుగా పుత్తూరు నగరి రహదారుల్లోనూ ఎర్రచందనం చెన్నై చేరుతోంది.
 వెఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి రాయచోటి, పెద్దమండ్యం బైపాస్, ములకలచెరువు, చింతామణి, చిక్‌బల్లాపూర్ ద్వారా స్మగ్లర్లు బెంగళూరు రూరల్‌లోని గోడౌన్లకు ఎర్రచందనం పంపిస్తారు. అక్కడి నుంచి వాహనాల్లో ముంబై హైవే ద్వారా రోడ్డుమార్గంలోనే ముంబైపోర్టుకు అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు సమాచారం.
     
 ఒక వేళ పోలీసులు ఈ రూట్‌లో దృష్టిసారిస్తే పీలేరు, పుంగనూరు, రామసముద్రం, చింతామణి మార్గంలో కర్ణాటకకు ఎర్రచందనం తరలిస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ముందుగా జిల్లాలోకి ఎర్రచందనం కూలీలు రాకుండా అటవీశాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా కృషి చేయాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement