అంధకారంలో ఆర్‌ఈసీఎస్‌!

 RECS C/O Corruption In Vizianagaram - Sakshi

116 శాశ్వత ఉద్యోగుల్లో మిగిలింది 30 మందే

సాక్షి, చీపురుపల్లి (విజయనగరం): ‘మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పిచూడు పురుగులుండు’ అనే చందంగా తయారైంది. ఆర్‌ఈసీఎస్‌ (గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం) పరిస్థితి. ఆర్‌ఈసీఎస్‌ పేరు వినగానే అవినీతికి అడ్రస్‌గా మారిందన్న ఆరోపణ తారాస్థాయికి చేరింది. నిత్యం విద్యుత్‌ వెలుగులు నింపాల్సిన ఆర్‌ఈసీఎస్‌లో అవినీతి మితిమీరడంతో అంధకారం ఆవరించింది. ఆర్‌ఈసీఎస్‌లో శాశ్వత ఉద్యోగులు సగానికిపైగా లేరు. క్షేత్రస్థాయి సిబ్బంది అసలే లేని దుస్థితి, ఉన్న వారిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోవడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో ఇక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకునేందుకు కనీసం విజిలెన్స్‌ లేదా జిల్లా అధికారులు పర్యవేక్షణ కూడా లేకపోవడం వెరసి ఆర్‌ఈసీఎస్‌ ప్రతిష్ట దిగజారిపోయింది. ప్రస్తుతం సంస్థలో ఉన్న ఆదాయం, ఏడాదికి అయ్యే ఖర్చు దాదాపు రెండూ సమానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్‌ఈసీఎస్‌ మనుగడ సాధించడం కష్టమేనన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

నిబంధనల ఉల్లంఘన
సహకార చట్టంలో సెక్షన్‌ 116(సి) ప్రకారం సంస్థ గ్రాస్‌ ప్రాఫిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఏటా ప్రభుత్వ అనుమతి తీసుకుని సహకారశాఖ నిబంధనలు సడలించి, 30 శాతానికి మించి సిబ్బందికి వేతనాలు ఇస్తూ, విద్యుత్‌ కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. సంస్థలో సరిపడా సిబ్బంది లేరు, నియామకాలకు సహకారశాఖ చట్టం 116(సి) ఒప్పుకోదు. దీంతో సిబ్బంది లేక, పనులు జరగక, నిర్లక్ష్యం పేరుకుపోయి చివరకు మనుషుల ప్రాణాలు పోతున్న సంఘటనలకు దారి తీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగదారులతో పాటు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1979లో ఏర్పడిన గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం(ఆర్‌ఈసీఎస్‌) ప్రస్తుతం అంపశయ్యపై ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఈసీఎస్‌ను ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం చేయడమే మంచిదన్న చర్చ సర్వత్రా సాగుతోంది.

తగ్గిపోతున్న శాశ్వత ఉద్యోగులు
చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు గుర్ల మండలంలో కొంత భాగంలో దాదాపు 100 గ్రామాలకు ఆర్‌ఈసీఎస్‌ సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో 116 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. అయితే వారిలో పదవీ విరమణలు పొందుతూ ప్రస్తుతానికి 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా 2019 చివరి నెలకు వచ్చే సరికి మరో ఏడుగురు వరకు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 20 మందికి పడిపోనుంది. ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల సంగతి పక్కన పెడితే నిత్యం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన క్షేత్ర స్థాయి సాంకేతిక ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆర్‌ఈసీఎస్‌లో ముగ్గురు ఏఈలకు గాను ఒక్కరు మాత్రమే ఉండగా, ఇద్దరు ఏడీలకుగాను ఒక్కరే ఉన్నారు. అలాగే ఆరుగురు లైన్‌ఇన్‌స్పెక్టర్లకు గాను ఇద్దరు ఉండగా అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ పొందనున్నారు. అలాగే 10 మంది లైన్‌మెన్‌ ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ లేనేలేరు. దీంతో మొత్తం 38 మంది కాంట్రాక్ట్‌ జూనియర్‌ లైన్‌మన్‌(సీజెఎల్‌ఎమ్‌)లుపైనే వ్యవస్థ అంతా నడుస్తోంది.

ఆదాయం రూ.5 కోట్లు.. ఖర్చు రూ.4 కోట్లు!
ఆర్‌ఈసీఎస్‌కు ఏడాదికి వస్తున్న గ్రాస్‌ ప్రాఫిట్‌కు ఆ సంస్థలో ఖర్చుకు దాదాపు సరిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు గ్రాస్‌ ప్రాఫిట్‌ వచ్చింది. అయితే ఈ రెండేళ్లలో సంస్థ ఖర్చు రూ.4 నుంచి రూ.5 కోట్లు వరకు అయింది. సహకారశాఖలో 116(సి) నిబంధన ప్రకారం గ్రాస్‌ ఫ్రాఫిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేసేందుకు అనుమతి లేదు. ఈ లెక్క ప్రకారం ఏడాదికి రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. అదే పరిస్థితి వస్తే వెంటనే సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి తప్పదు. ఇంతవరకు ప్రభుత్వ అనుమతి తీసుకుని 116(సి) నిబంధనలను సడలిస్తూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు.

ఏపీఈపీడీసీఎల్‌లో ప్రమాదాలకు బ్రేక్‌
వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యం, ముడులు పెట్టని విద్యుత్‌ వైర్లు కారణంగా చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస, రామలింగాపురం, యలకలపేట గ్రామాల్లో గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మూగజీవాల మరణాలు లెక్కేలేదు. దీంతో వారి కుటుంబాలకు ఆర్‌ఈసీఎస్‌ నష్టపరిహారం చెల్లిస్తూ వస్తోంది. అదే ఏపీఈపీడీసీఎల్‌లో అయితే ప్రమాదాలకు అవకాశమే లేదు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో హై ఓల్టేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌(హెచ్‌వీడీఎస్‌) అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మూడు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి కేబుల్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top