ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల కోసం ఏర్పాట్లు....
ఒంగోలు టౌన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల కోసం ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకరరావుతో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు తెలిపారు.
శనివారం 10.30 గంటలకు ప్రకాశం భవనం ఆవరణలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పుష్పాలంకరణ, ప్రార్థన.. 10.45 గంటలకు జ్యోతి ప్రజ్వలన.. 11.15 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం.. 11.20 గంటలకు వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. 11.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.45 గంటలకు వందన సమర్పణ జరుగుతుందని వివరించారు. ఆ తర్వాత దేవరంపాడు గ్రామంలోని ఉప్పు సత్యాగ్రహ స్థూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వినోదరాయునిపాలెంలోని ఆంధ్రకేసరి ఉన్నత పాఠశాలలో ప్రకాశం పంతులు విగ్రహానికి పుష్పమాలాంకరణ చేస్తామని తెలిపారు. అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.