ఇంగ్లిష్‌ మీడియం మీ పిల్లలకేనా?

Ramoji Rao, vemuri Radhakrishna children studying in english medium - Sakshi

ఇంగ్లిష్‌లోనే రామోజీరావు, రాధాకృష్ణ పిల్లల చదువులు

లోకేశ్, బ్రాహ్మణిల విద్యాభ్యాసమంతా ఆంగ్ల మాధ్యమంలోనే..

సాక్షి ప్రతినిధి, హైదరాబాద్‌/నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శల దాడి చేస్తూ వచ్చారు. ఆయనకు వంతపాడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వ్యతిరేక కథనాలు ప్రచురించాయి. ఒక రకంగా యుద్ధం ప్రకటించాయి. అయితే ఈ పత్రికల యజమానుల పిల్లలు, మనుమళ్లు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకోవడం గమనార్హం. ఈనాడు అధినేత రామోజీరావు కుమారులు సుమన్, కిరణ్‌లు ఇద్దరూ ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, లిటిల్‌ ప్లవర్‌లో వారి ప్రాథమిక విద్య కొనసాగింది. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కుమారుడు ఆదిత్య, కూతురు అనూషలు హైదరాబాద్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఇంగ్లిష్‌లోనే తమ విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు మనుమడు దేవాన్‌‡్ష కూడా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నాడు.

వెంకయ్య అక్షర ఇంటర్నేషనల్‌లో ఇంగ్లిష్‌ మీడియమే..
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి కుమార్తెకు చెందిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్షర విద్యాలయ పేరుతో ఇంటర్నేషనల్‌ స్కూలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఈ స్కూలులో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం 2019–20 విద్యా సంవత్సరంలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్‌కు వెంకయ్యనాయుడి కుమార్తె దీపా వెంకట్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇంగ్లిష్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్‌ పిల్లలు మొదటి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నారు. హర్షవర్ధన్‌ కుమార్తెలు వైష్ణవి, నిహారికల ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోనే సాగింది. వీరిలో ఒకరు ప్రస్తుతం సింగపూర్‌లో చదువుతుండగా, మరొకరు ఢిల్లీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. దీపా వెంకట్‌ కుమారుడు విష్ణు ఆస్ట్రేలియాలో చదువుతుండగా.. కుమార్తె సుష్మ ఢిల్లీలో చదువుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top