రామాయపట్నం వైపే కేంద్రం మొగ్గు..!

'Ramayapatnam best suited for Central port project' - Sakshi

పోర్టు నిర్మాణ వ్యయం రూ.17,615 కోట్లు

 మూడేళ్ల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం

కావలి: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో అనూహ్యమైన అభివృద్ధి, అపారమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కలిగే రామాయపట్నం తీరం వద్ద భారీ ఓడ రేవు, నౌకాశ్రయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. మూడేళ్ల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటానికి సత్ఫలితాలు రానున్న సంకేతాలు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్‌లో పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డ్‌ నిర్మాణ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు నిలదీశారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి దీనిపై విజ్ఞాపనలను అందజేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేరుగా దీనిపై సత్వరమే చర్యలు తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ తీసుకోవాలని నితిన్‌ గడ్కరీకి లేఖలు రాశారు.

కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా కమిటీ సభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ముందడుగేసి రామాయపట్నం పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డ్‌ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి దీని ఆవశ్యతను ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసింది. ఈ క్రమంలో పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌గా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి సారథ్యంలో కావలి నుంచి రామాయపట్నం వరకు 25 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. 2016 సెప్టెంబర్‌ మూడున నిర్వహించిన పాదయాత్రలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘దుగరాజపట్నం’పై ఆది నుంచి గందరగోళం
కేంద్ర ప్రభుత్వం 2011లో దేశంలో బంగాళాఖాతం ఒడ్డున రెండు భారీ ఓడరేవులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో సాగర్‌ సముద్ర తీరాన్ని ఆ రాష్ట్రం ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదే ఏడాదిలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మాత్రం విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం తీర ప్రాంతాలను ఆయా ప్రాంత నాయకులు తెరపైకి తీసుకొ చ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణా నికి ప్రదేశం ఎంపికలో వివాదం తత్తిం ది. దీనిపై నిపుణుల కమిటీ రామాయపట్నం తీరం భారీ పోర్టు కమ్‌ షిప్‌ యార్డుకు అన్ని రకాలుగా సానుకూలమని నివేదికలిచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఓ లేఖను అప్పటి కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంతో బ్రేక్‌ పడింది. అప్పటి నుంచి ఆ వ్యవహారం మరుగున పడిపోయింది.

షార్‌ అభ్యంతరాలు
2015 జూలైలో కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని, తొలి విడతలో రూ.6,091 కోట్లను ఖర్చు పెట్టాలని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యల్లేవని ప్రకటించారు. అయితే 2017లో కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నంలో పోర్టు కమ్‌ షిప్‌యార్డ్‌ నిర్మాణం కుదరదని, షార్‌ అభ్యంతరాలు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. మరో ప్రత్యామ్నాయ ప్రదేశం చూపాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకొని రామాయపట్నం వద్ద పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డ్‌ నిర్మాణానికి ఆమోదిస్తూ కేంద్రానికి లేఖ రాయడమే మిగిలి ఉంది. మరోవైపు భారీ నౌకాశ్రయాన్ని నిర్మిస్తామని.. ప్రదేశాన్ని చూపమని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తే, దానికి సమీపంలో ఉన్న కావలి పట్టణానికి మహర్దశ పట్టనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top