మొదటి విడత రచ్చబండ కార్యక్రమా న్ని గ్రామాల్లో నిర్వహించిన సర్కారు రెండో విడత కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే పరిమి తం చేసింది.
కామారెడ్డి, న్యూస్‌లైన్ : మొదటి విడత రచ్చబండ కార్యక్రమా న్ని గ్రామాల్లో నిర్వహించిన సర్కారు రెండో విడత కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే పరిమి తం చేసింది. నిలదీతలను తప్పించుకోవడం కోసం మూడో విడతలో కేవలం లబ్ధిదారులనే రప్పించాలని పథకం రచించారు. లబ్ధిదారుల కు ఎంట్రీ పాస్‌లు ఇచ్చారు. అయితే కొత్తగా ప్రభుత్వ పథకాల కోసం వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ప్రతి చోటా రచ్చబండ సభలు రసాభాసగా మారాయి. ‘బంగారుతల్లి’కి దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం మాచారెడ్డిలో నిర్వహించిన రచ్చబండకు ఓ తల్లి మూడు నెల ల పాపతో వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో తన కూతురును కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రభు త్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఆ తల్లి కూతురిని కోల్పోయింది.
రచ్చబండను నీరుగార్చడం వల్లే...
ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన రచ్చబం డ లక్ష్యాన్ని దెబ్బతీయడం వల్లే ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. రచ్చబండలో దరఖాస్తు చేయడం కోసం వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాట ఓ చిన్నారిని పొట్టనపెట్టుకున్న సంఘటన అందరినీ వేదనకు గురి చేసింది. రచ్చబండలో దరఖాస్తులు ఇచ్చేందుకు వందలాది మంది తరలి వస్తుండడం, దరఖాస్తులు సమర్పించడం కోసం గంటల తరబడి బారులు తీరాల్సి రావడంతో తోపులాట జరుగుతోంది. అదే గ్రామాల్లో సభలు నిర్వహిస్తే ఇంత మంది ఉండరు. తక్కువ మంది వస్తే సమస్యలు చెప్పుకోవడానికీ అవకాశం ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రచ్చబండను గ్రామాల వారీగా నిర్వహించాలని కోరుతున్నారు.