తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో జిల్లా బీజేపీ శ్రేణుల్లో అయోమయం చోటుచేసుకుంది.
- టీడీపీతో కొలిక్కిరాని బీజేపీ చర్చలు
- ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లు లీక్
- నేడు మదనపల్లెలో బీజేపీ బహిరంగసభ
సాక్షి, తిరుపతి: తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో జిల్లా బీజేపీ శ్రేణుల్లో అయోమయం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీల నడుమ అవగాహన ఉంటుందని భావిస్తున్నప్పటికీ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిరాశకు గురవుతున్నాయి. ఇప్పటికే తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు తిరుపతి, మదనపల్లె, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ లీక్ చేసింది.
పొత్తులపై చర్చలకు ముందే లీకులు రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత కొత్త పరిణామాలు చోటుచేసుకోవడం, టీడీపీతో సీట్ల సర్దుబాటు ఉంటుందనే ప్రచారం జరగడంతో కార్యకర్తలను నిస్తేజం ఆవహించింది. ఒకవేళ సీట్ల సర్దుబాటు జరిగితే జిల్లాలో తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు మదనపల్లె లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఖాయంగా బీజేపీకి కేటాయిస్తారని అంటున్నారు.
1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజ యం సాధించారు. దీంతో ఈసారి కూడా తిరుపతి లోక్‌సభ స్థానంపై బీజేపీ కన్నేసింది. ఈ స్థానానికి ఇప్పటికే ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఇంకా కొందరు పోటీ పడుతున్నారు. వైద్యవృత్తిలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మునిసుబ్రమణ్యం, డాక్టర్ సుకుమార్ పేర్లు తిరుపతి లోక్‌సభకు పముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ లోక్‌సభ సభ్యులు వెంకటస్వామి కుమారుడు గౌతమ్ పేరు కూడా వినిపిస్తోంది.
చల్లపల్లెకు మదనపల్లె
టీడీపీతో పొత్తు కుదిరినా, ఒంటరి పోరాటమైనా బీజేపీ తరఫున శాసనసభకు పోటీ చేసేందుకు ఆ పార్టీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి సిద్ధమవుతున్నారు. పొత్తు కుదిరితే మదనపల్లె నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే తంబళ్లపల్లె లేదా మదనపల్లె నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తంబళ్లపల్లె నుంచి ఒక దఫా పోటీ చేసిన చల్లపల్లె విజయం అంచుల వరకు వెళ్లారు. అప్పట్లో 620 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తంబళ్లపల్లె, మదనపల్లె స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే అభిప్రాయం ఉంది.
నేడు బహిరంగ సభ
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడుతో పాటు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా హాజరవుతున్నారు. ఈ సభ పార్టీ శ్రే ణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.