జాతీయ రహదారిపై భీమడోలు రైల్వేగేటు సమీపంలో కనకదుర్గాదేవి ఆలయం వద్ద డివైడర్ దాటుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సుమారు
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
Feb 24 2014 3:26 AM | Updated on Sep 2 2017 4:01 AM
భీమడోలు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై భీమడోలు రైల్వేగేటు సమీపంలో కనకదుర్గాదేవి ఆలయం వద్ద డివైడర్ దాటుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయూణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. విజయనగరం నుంచి గుంటూరుకు శనివారం యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయూణికులతో బయల్దేరింది. వీరిలో విజయవాడ, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. భీమడోలు సమీపంలోకి వచ్చేసరికి వైజాగ్ నుంచి పొటాష్ లోడు ద్వారకాతిరుమల వెళ్తున్న లారీ రైల్వేగేటు లోంచి వెళ్లేందుకు కనకదుర్గాదేవి ఆలయ సమీపంలో ఉన్న డివైడర్ గుండా రాంగ్ రూట్‌లోకి వెళ్తూ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెనుక నుంచి వచ్చిన బస్సు వేగంగా ఢీకొంది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో పెద్ద శబ్దం రాగా నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ప్రమాదంలో గుంటూరుకు చెందిన బస్సు డ్రైవర్ కె.రామిరెడ్డి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. 20 మంది ప్రయూణికులు తీవ్రంగా గాయపడగా, ముందు సీట్లు తగిలి పలువురు గాయపడ్డారు. భీమడోలు అంబులెన్స్, నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో గుంటూరు జిల్లా మడిచర్లకు చెందిన ఎ.లక్ష్మణరావు, విజయనగరానికి చెందిన పి.గోవిందరావు, శ్రీకాకుళంకు చెందిన ఎస్.కొండలరావు, ప్రకాశం జిల్లాకు చెందిన జి.రవిచంద్ర, శ్రీకాకుళంకు చెందిన ఆనంతరామయ్య, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన జి.విష్ణు, గుంటూరుకు చెందిన పైడిరాజు, జగదాంబ తదితరులు ఉన్నారు. నేషనల్ హైవే క్రేన్ సహాయంతో లారీ, బస్సులను పక్కకు లాగారు. బస్సులో ఇరుక్కున వారిని అద్దాలు పగలుగొట్టి బయటకు తీశారు. గ్రామస్తులు, పోలీసులు అతికష్టంతో బస్సు డ్రైవర్ రామిరెడ్డిని బయటకు తీసి, ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
Advertisement
Advertisement