కరెంట్ కోతతో మూతపడిన సత్యసాయి ఆస్పత్రి | Sakshi
Sakshi News home page

కరెంట్ కోతతో మూతపడిన సత్యసాయి ఆస్పత్రి

Published Thu, Oct 10 2013 1:00 AM

కరెంట్ కోతతో మూతపడిన సత్యసాయి ఆస్పత్రి - Sakshi

సాక్షి, నెట్‌వర్‌‌క: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెతో ప్రజల కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు ఉత్పత్తి పడిపోవడం, మరోవైపు బ్రేక్ డౌన్‌లను సరిచేసేవారు లేకపోవడంతో సీమాంధ్రను చీకట్లు వీడడం లేదు. ఆస్పత్రులకు కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో కొన్నింటిని మూసివేస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సిమ్స్)కి మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో సాధారణ సేవలను నిలిపివేశారు. జనరేటర్ సాయంతో అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే ‘విద్యుత్ సరఫరాలో నిరవధిక అంతరాయం వల్ల ఆస్పత్రిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయడమైనది’ అనే నోటీసును రెండు ప్రధాన ద్వారాల వద్ద అతికించారు.

దేశం నలుమూలల నుంచి వచ్చే రోగులు నెలల తరబడి ఇక్కడే ఉంటూ ఆస్పత్రిలో ఉచిత వైద్యసేవలు పొందుతారు. ఆస్పత్రిని మూసివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులో పూర్తిగా విద్యుత్‌పైనే ఆధారపడిన ఆక్వా సాగు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. గుంటూరు జిల్లాలో చిన్న పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో కేంద్ర ఆస్పత్రులు, విమానాశ్రయాలు, తిరుమలకు మాత్రమే విద్యుత్‌సరఫరా చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కోల్డ్ స్టోరేజీలకు విద్యుత్ సరఫరా లేక కోట్ల రూపాయల విలువ చేసే సరుకు దెబ్బతింటోందని చేపలు, రొయ్యల సరఫరాదారులు, ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు పరిశ్రమలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు రోజుల సమ్మె వల్ల 73.84 మిలియన్ యూనిట్ల ఉత్పాదన కు కోతపడింది.

Advertisement
Advertisement